
చెన్నైకి (chennai) నీటి సరఫరా కోసం శ్రీశైలం (srisailam reservoir) వద్ద ప్రత్యేక ఎత్తిపోతల పథకాన్ని (lift irrigation) ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ విభేదించింది. శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే భారీగా నీటిని తరలించినందున అందులో నుంచి చెన్నైకి నీరు ఇవ్వాలని సూచించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) (krishna river management board) సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో చెన్నై తాగునీటి కమిటీ ఆరో సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు.
తమకు మరో ఆరు టీఎంసీల నీరు విడుదల చేయాలని తమిళనాడు కోరింది. అయితే ఆ నీటిని శ్రీశైలం నుంచి ఇచ్చేలా చూడాలని ఏపీ ప్రతిపాదించింది. దానిపై స్పందించిన తెలంగాణ.. ఈ ఏడాది ఇప్పటికే ఏపీ ఎక్కువ నీటిని కండలేరుకు తరలించినందున అక్కడి నుంచి చెన్నైకి నీరివ్వాలని సూచించింది. ఏటా సమస్య కాకుండా శ్రీశైలం వద్ద ప్రత్యేకంగా ఎత్తిపోతలను నిర్మించుకోవాలని తమిళనాడుకు ఏపీ సూచించింది. అయితే ఆ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ALso Read:కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు : కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ
కండలేరు నుంచి చెన్నై వరకు పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ప్రాజెక్టు డీపీఆర్ అందితే దానిపై అభిప్రాయం చెబుతామని తెలంగాణ స్పష్టం చేసింది. మరోవైపు చెన్నైకి తాగునీటి సరఫరా కమిటీ నుంచి తమను తప్పించాలని మహారాష్ట్ర, కర్ణాటక మరోమారు కోరాయి. చెన్నై అవసరాల కోసం తాము ఇవ్వాల్సిన 10 టీఎంసీల (5 టీఎంసీలు చొప్పున) నీటిని తమ నికర జలాల కోటా నుంచి మినహాయించుకోవాలని ఆ రెండు రాష్ట్రాలు బోర్డుకు తెలియజేశాయి.