తెలంగాణలో మాస్క్ తప్పనిసరి.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ. 1,000 జరిమానా..!

By Sumanth KanukulaFirst Published Jun 30, 2022, 12:26 PM IST
Highlights

తెలంగాణ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నట్టుగా  ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. 

తెలంగాణ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నట్టుగా  ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టుకు సమాధానమిచ్చారు. ఓ నెటిజన్ మెట్రో రైలు ప్రయాణించే మాస్క్‌ వినియోగం గురించి ట్విట్టర్ వేదికగా  ప్రశ్నించగా.. అందకు మెట్రో యజమాన్యం స్పందించింది. ‘‘మాస్క్‌లు ధరించడమనేది మా సలహా, మా ప్రయాణీకులు మాస్క్ ధరించమని మేము సిఫార్సు చేస్తున్నాం’’ అని పేర్కొంది. 

దీనిపై స్పందించిన డీహెచ్ శ్రీనివాసరావు.. ‘‘కేసులు పెరుగుతున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మెట్రో రైల్‌తో సహా బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్క్ ధరించాలని నేను కోరుతున్నాను. నిబంధన పాటించకపోతే రూ.1000/- జరిమానా ఉంటుంది’’ అని కామెంట్ చేశారు. 

ఇక, తెలంగాణలో రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా 485 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,421కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జిల్లాలో 257, మేడ్చల్ మల్కాజిగిరిలో 37, రంగారెడ్డిలో 58 కేసులు ఉన్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,00,476కి చేరుకుంది. 

తాజాగా కరోనా నుంచి 236 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 7,91,944కి చేరుకుంది. ప్రస్తుత పాజిటివిటీ రేటు 1.7 శాతం కాగా, రికవరీ రేటు 98.93 శాతంగా ఉంది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడంతో మరణాల సంఖ్య 4,111గా ఉంది. 

ఇక, రాష్ట్రంలో బుధవారం మొత్తం 27,130 నమూనాలను పరీక్షించారు. తెలంగాణ ఇప్పటివరకు పరీక్షించిన నమునాల సంఖ్య 3.55 కోట్లకు చేరింది. గత 10 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా..10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కోవిడ్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. 


 

click me!