
హైదరాబాద్: భారీగా పెరిగిన పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ కు తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలపై మరింత భారం మోపడంపై కాంగ్రెస్ పార్టీ (telangana congress party) ఆందోళన బాట పట్టింది. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఇవాళ(గురువారం) భారీఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా కాంగ్రెస్ సీనియర్లను పోలీసులు ఉదయం నుండే హౌస్ అరెస్ట్ చేసారు. ఇలా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka)ను కూడా ఇంటినుండి బయటకు రానివ్వకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
ఇవాళ ధాన్యం కొనుగోలు (paddy procurement) చేయకపోవడంతో సివిల్ సప్లై కార్యాలయం, కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసనగా విద్యుత్ సౌధను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులంతా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి విద్యుత్ సౌధ, పౌరసరఫరా కార్యాలయం వద్దకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగానే అలెర్ట్ అయ్యారు.
ఇవాళ తెల్లవారుజాము నుండే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నాయకుల ఇళ్లవద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఇళ్ల నుండి నాయకులు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. ఇలా బంజారాహిల్స్ లోని బి.యన్.రెడ్డి కాలనీలో గల భట్టి విక్రమార్క ఇంటికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ముట్టడించారు. ఇంట్లో నుంచి ఆయనను బయటకు రానివ్వకుండా కట్టడి చేశారు.
Video
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ, ప్రతి రాజకీయ పార్టీకి వుంటుందని... ఆ హక్కును సైతం తెలంగాణ ప్రభుత్వం కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. నిన్న టీఆర్ఎస్ మంత్రులు, గులాబీ పార్టీ నాయకులు జాతీయ రహదారుల దిగ్బంధం, ధర్నాలు చేసారని భట్టి గుర్తుచేసారు. వారిని అడ్డుకొకుండా దగ్గరుండి ఏర్పాట్లు చూసిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను మాత్రం అడ్డుకోవడం అప్రజాస్వామికమని భట్టి అన్నారు.
కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలను మాత్రమే అడ్డుకుంటారా? టిఆర్ఎస్ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకోలేడం లేదు అని నిలదీశారు. చట్టం అందరికీ సమానం కాదా? టీఆర్ఎస్ కు ఏమైనా చుట్టమా అని భట్టి ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు పేరిట రైతు రాజకీయం చేయడం టిఆర్ఎస్, బీజేపీలు మానుకోవాలని భట్టి హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్రమే కొనుగోలు చేసి ఆ తర్వాత కేంద్రంతో యుద్ధం చేయాలని సూచించారు. సిగ్గులేని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..? అంటూ భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేసారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ రేవంత్ బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది.