అమ్మా ఇక సెలవు: సుష్మాస్వరాజ్ మృతిపై విజయశాంతి భావోద్వేగ లేఖ

By Nagaraju penumalaFirst Published Aug 7, 2019, 8:01 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలో చాలామంది ఢిల్లీ నేతలు మెుహం చాటేస్తే అండగా నిలిచింది సుష్మాస్వరాజ్ అంటూ గుర్తు చేశారు. తాను కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఆవశ్యకత గురించి సుష్మాస్వరాజ్ తో చెప్పిన వెంటనే అడిగిందే తడవుగా అనేకమంది ప్రముఖులతో తమకు మద్దతుగా నిలిచిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. 

హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణంపై కన్నీట పర్యంతమయ్యారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి. భారత దేశం ఒకగొప్ప లీడర్ ని ,గొప్ప మానవతావాదిని కోల్పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

సుష్మాస్వరాజ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుస్మాస్వరాజ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు విజయశాంతి. 1998 జనవరిలో ఢిల్లీలో మంచుకురుస్తున్న ఓ ఉదయం సుష్మా స్వరాజ్ తో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 

తాను బీజేపీలో చేరుతున్న సందర్భంలో తనను తేజస్విని అంటూ పలకరించారని గుర్తు చేశారు. సుష్మాస్వరాజ్ తేజస్విని అని పిలవగానే తాను ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు. తేజస్విని జి కి ఒక వేడి టీ తెండి అంటూ తాను నటించిన హిందీ కర్తవ్యం సినిమాలోని తన పాత్ర పేరుతో ప్రేమగా తనను గౌరవించారని చెప్పుకొచ్చారు. 

తాను బీజేపీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ మధ్య గౌరవం, అభిమానం అలాగే కొనసాగిందని తెలిపారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో సుష్మాస్వరాజ్ తో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టమని ఒక మధురమైన జ్ఞాపకం అంటూ చెప్పుకొచ్చారు. 

సుష్మాస్వరాజ్ బళ్ళారి నుండి ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించారని అప్పుడు అక్కడ తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు. 8 రోజుల పాటు సుమారుగా 40 సభలు , ర్యాలీలలో తుఫానులాగా తాను సుష్మాస్వరాజ్ తో కలిసి పనిచేయటం ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తు చేశారు. 

ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు సుష్మాస్వరాజ్ అన్న వ్యాఖ్యలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఒకవేళ దిగువ బెర్త్ వస్తే, "మీరు బాగా జెంప్స్, ఫైట్స్ చేస్తారు కదా! అప్పర్ బెర్త్ తీసుకోండి "అంటూ తనతో జోకులు వేసేవారని గుర్తు చేశారు. 

పార్లమెంట్లో తాను తెలంగాణ కోసం పోరాడుతుంటే అరిచి అరిచి నాబిడ్డ గొంతు పోయింది, హాట్ గులాబ్ జామూన్ తింటే సర్దుకుంటుంది, అని తినిపించిన ఆమె ప్రేమ తనకే సొంతం అంటూ చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలో చాలామంది ఢిల్లీ నేతలు మెుహం చాటేస్తే అండగా నిలిచింది సుష్మాస్వరాజ్ అంటూ గుర్తు చేశారు. తాను కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఆవశ్యకత గురించి సుష్మాస్వరాజ్ తో చెప్పిన వెంటనే అడిగిందే తడవుగా అనేకమంది ప్రముఖులతో తమకు మద్దతుగా నిలిచిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. 

తాను టీఆర్ఎస్ ఎంపీగా పనిచేస్తున్నప్పుడు పార్లమెంట్ లో సస్పెండ్ కు గురైన సందర్భంలో తన వద్దకు వచ్చి ఓదార్చిన విషయాన్ని గుర్తు చఏశారు. పార్లమెంట్ లో తన దగ్గరకు వచ్చి  నా బిడ్డ నిజాయితీ పరురాలు, ధైర్య వంతురాలు తనకు నేనుంటాను అని చెప్పిన మానవతామూర్తి అంటూ విజయశాంతి అభిప్రాయపడ్డారు. 

రాస్తే ఇంకా ఎన్నో జ్ఞాపకాల గుర్తులు వస్తూ ఉంటాయని కానీ రాస్తుంటే కన్నీరు అవేదనతో కలిసి వస్తుందంటూ విజయశాంతి తన ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా ఇక సెలవు మీ తేజస్విని అంటూ విజయశాంతి బోరున విలపించారు. ఈ సందర్భంగా లోక్ సభలో సుష్మాస్వరాజ్ తో ఉన్న వీడియోను విజయశాంతి పోస్ట్ చేశారు.

 

click me!