కేసీఆర్ కేబినెట్లో చీలిక వచ్చింది: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Oct 19, 2019, 1:39 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్ మంత్రివర్గంలో స్పష్టమైన చీలిక వచ్చిందని తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ తన చెల్లెను గెలిపించుకోలేదని, తాను అక్క పద్మావతిని గెలిపిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట: మంత్రి కేటీఆర్ నిజామాబాదులో చెల్లెను (కల్వకుంట్ల కవితను) గెలిపించుకోలేకపోయారని, తాను మాత్రం హుజూర్ నగర్ లో అక్క పద్మావతిని గెలిపించుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు తెలంగాణ స్వరూపాన్ని మార్చేది హుజూర్ నగర్ ఉప ఎన్నికనే అని ఆయన అన్నారు. 

కాంగ్రెసులో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, భిన్నాభిప్రాయాలు ఉంటాయని, కానీ అభిప్రాయ భేదాలు ఉండవని రేవంత్ రెడ్డి అన్నారు. కోర్టులతో కేసీఆర్ ఆటలాడితే మొట్టికాయలు తప్పవని, మంత్రివర్గంలో స్ఫష్టమైన చీలిక వచ్చిందని ఆయన అన్నారు.  కేసీఆర్ మంత్రివర్గంలో స్ఫష్టమైన చీలిక వచ్చిందని, ఉద్యమ నాయకులు ఎవరు కూడా ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడమే దానికి నిదర్శనమని ఆయన అన్నారు. 

సూర్యాపేట జిల్లాలోని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రెండో దఫా పాలన పడకేసిందని అన్నారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ రోజు జరుగుతున్న బంద్ కు కేసీఆర్ మాత్రమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తమ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టలేదని మంత్రులు అంటున్నారని, అయితే ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేస్తామని మానిఫెస్టోలో పెట్టలేదు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అని ఆయన అన్నారు. 

ఎర్రబస్సుకు 27 శాతం ఇంధనం పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎయిర్ బస్సుకు మాత్రం 1 శాతం పన్ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 85 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

సెల్ఫ్ డిస్మిస్ అని ఉద్యోగులను అనే అధికారం కేసీఆర్ కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని అన్నారు. ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రుల ద్వారా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు కూడా కార్మికుల మనోభావాలను దెబ్బ తీశాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను ఇంధనంగా వాడి కేసీఆర్ బతుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

సూర్యాపేటలో స్వచ్ఛందంగా సహకరించిన రోడ్డు వెడల్పు బాధితులను మరో ఐదు అడుగులు వెనక్కి జరగాలని బెదరింపులకు దిగడాన్ని ఆయన ఖండించారు. పాలనా లోపం వల్లనే మూసీ గేట్లు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు నైతిక బాధ్యత వహించి మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక నుంచి ల్యాండ్ మాఫియా దాకా అంతా జగదీశ్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

click me!