రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లెన్ని ?

First Published Mar 23, 2018, 7:04 PM IST
Highlights
  • ఉన్న ఓట్లను సద్వినియోగం చేసుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీ
  • అధికార పార్టీని ఎక్స్ పోజ్ చేశామంటున్న హస్తం నేతలు

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఆ పార్టీ తరుపున మాజీ మంత్రి బలరాం నాయక్ ఎన్నికల బరిలో దిగారు. అయితే తమకు సరిపోయే ఓట్లు లేవని తెలిసినా ఆ పార్టీ బరిలోకి దిగింది. ఎందుకంటే అధికార పార్టీని టెన్షన్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తాము పోటీ చేసినట్లు ఆ పార్టీ నేతలు ముందునుంచీ చెబుతూనే ఉన్నారు.

అయితే అసెంబ్లీ లెక్కల ప్రకారం 108 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో దొంతి మాధవరెడ్డి ఓటును కౌంటింగ్ లో చెల్లుబాటు కాలేదు. మిగతా 107 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 ఓట్లు మాత్రమే దక్కాయి. టిఆర్ఎస్ తరుపున గెలిచిన బండ ప్రకాశ్ ముదిరాజ్ కు 33 ఓట్లు పోల్ కాగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ కు 32 ఓట్లు వచ్చాయి. దీంతో మెజార్టీ ఓట్లు వచ్చిన ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిచినట్లు ప్రకటించారు ఎన్నకల అధికారులు. వారికి సర్టిఫికెట్లు జారీ చేశారు.

అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తనకున్న వనరులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అధికార కక్ష సాధింపు చర్యల కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఓట్లను ఆ పార్టీ చేజార్చుకుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న నర్సంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఓటు చెల్లుబాటు కాకుండాపోయింది. ఆయన పోలింగ్ ఏజెంట్ కు బ్యాలెట్ పేపర్ చూపించి ఓటేశారు. దీంతో ఆ ఓటు కాంగ్రెస్ చేజార్చుకున్నది.

ఇదిలా ఉంటే ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకోలేదు. పార్టీ మారినప్పుడే తాను రాజీనామా చేశానని.. కాబట్టి తాను ఓటు వేసే చాన్సే లేదని ఆయన వెల్లడించారు.

ఇక ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. వారంతా అధికార టిఆర్ఎస్ పార్టీకే ఓటేశారు.

బలం లేదని తెలిసినా.. ఏకగ్రీవం కాకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచిందని, తమ గెలుపోటములతో సంబంధం లేకుండా తమ లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

 

click me!