తెలంగాణలో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుండి కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులు స్వీకరిస్తుంది.సత్తుపల్లి నుండి టిక్కెట్టు కోసం మావనవాతారాయ్ ధరఖాస్తును అందించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుండి కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ నెల 18వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఎమ్మెల్యే టిక్కెట్ల ధరఖాస్తు పత్రాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు నిన్న ఆవిష్కరించారు. నిన్నటి నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడ ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి మానవతారాయ్ ధరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్న వారిలో మానవతారాయ్ మొదటి నేత కావడం గమనార్హం.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుండి కాంగ్రెస్ నాయకత్వం ధరఖాస్తులను స్వీకరించనుంది.అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ గత వారంలో సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నలుగురైదుగురు పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేస్తుంది. ఈ నలుగురి అభ్యర్థుల్లో గెలుపు అవకాశం ఉన్న అభ్యర్ధి పేరును స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. ఈ పేరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీకి పంపనుంది. సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.ఈ దిశగా కార్యాచరణను మరింత వేగవంతం చేసింది.