ఎయిర్‌పోర్ట్ వరకు హైదరాబాద్ మెట్రో విస్తరణకు బ్రేక్ .. అక్కర్లేదన్న సీఎం, రేవంత్ రెడ్డి ఆలోచనేంటీ..?

By Siva KodatiFirst Published Dec 14, 2023, 3:52 PM IST
Highlights

హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్ ప్లాన్ నిలిపివేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాతబస్తీ ప్రజల అవసరాల దృష్ట్యా మెట్రో సదుపాయం వారికి కూడా అందుబాటులో వుండాలని రేవంత్ రెడ్డి సూచించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ మందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి . ప్రజా భవన్‌లో వినతులు స్వీకరించడం దగ్గరి నుంచి మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించడం, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ పరిశీలన సహా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్ ప్లాన్ నిలిపివేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

టెండర్ ప్రక్రియను సైతం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై బుధవారం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ, మెట్రో అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఇప్పటికే విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం వుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Latest Videos

ఇది కాకుండా విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయంగా మరో అలైన్‌మెంట్ తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాతబస్తీ ప్రజల అవసరాల దృష్ట్యా మెట్రో సదుపాయం వారికి కూడా అందుబాటులో వుండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎంజీబీఎస్, ఫలక్‌నుమా, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట నుంచి మెట్రో అలైన్‌మెంట్ ఉండాలన్నారు. ఎల్ అండ్ టీ మెట్రో రైలు, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ రాయితీ ఒప్పందాలను పరిశీలించి.. మూసీ వెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ వుండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్‌పోర్టుకు మంచి కనెక్టివిటీ వున్న నేపథ్యంలో  చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, ఎయిర్‌పోర్ట్ పీ7 రోడ్డు నుంచి ఒక మార్గం.. చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం మార్గంలో మరో మార్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ రెండింటిలో ఏది తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఎలైన్‌మెంట్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా హైదరాబాద్ తూర్పు, మధ్య, పాత నగరంలోని ప్రజలకు రవాణా సదుపాయం అందుతుందన్నది సీఎం రేవంత్ రెడ్డి యోచన.

కాగా.. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలును విస్తరించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనిలో భాగంగా ఎలైన్‌మెంట్‌ను సైతం ఖరారు చేసి టెంటర్లను సైతం పిలిచింది ప్రభుత్వం. వాటిని ఆమోదించే క్రమంలో ఎన్నికల షెడ్యూల్ , కోడ్ అమల్లోకి రావడంతో టెండర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌కు రూ.6250 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు.

హెచ్ఎండీఏ నుంచి రూ.600 కోట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొత్తగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి మాత్రం .. ఎయిర్‌పోర్ట్ మెట్రో అవసరం లేదని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ కారిడార్ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ప్రజలు, మేధావులు, రాజకీయ పక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తన నిర్ణయంపై పునరాలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

click me!