kcr delhi tour : ఢిల్లీలో సర్వోదయ పాఠశాల, మొహల్లా క్లినిక్‌ను సందర్శించిన కేసీఆర్.. వెంట కేజ్రీవాల్

By Siva KodatiFirst Published May 21, 2022, 5:43 PM IST
Highlights

ఢిల్లీలో పర్యటనలో భాగంగా నగరంలోని సర్వోదయ పాఠశాల, మొహల్లా క్లినిక్‌‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న సేవల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 

ఢిల్లీ పర్యటనలో వున్న (kcr delhi tour) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) బిజిబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా శనివారం నగరంలోని సర్వోదయ పాఠశాలను (sarvodaya school) సందర్శించారు కేసీఆర్. ఆయన వెంట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (manish sisodia) వెంట వున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ మొహల్లా క్లినిక్‌ను (mohalla clinic) సందర్శించనున్నారు. అక్కడికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా మొహల్లా క్లినిక్‌లో అందుతున్న సేవల గురించి కేసీఆర్‌కు అధికారులు వెల్లడించారు. విద్య, వైద్య రంగం మెరుగ్గా ఉండాల్నదే ప్రజల కోరిక అన్నారు. ఢిల్లీ సర్కార్‌ను చూసే తెలంగాణలో బస్తీ దవాఖానాలు పెట్టామని కేసీఆర్ తెలిపారు. మొహల్లా క్లీనిక్‌లో రిటైర్డ్, ప్రైవేట్ వైద్యులకు కూడా పనిచేసే అవకాశం కల్పించారని ఆయన ప్రశంసించారు. 

అంతకుముందు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో (akhilesh yadav) కేసీఆర్ శనివారం భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే దేశానికి ప్రత్యామ్నాయ కూటమి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. 

Also Read:తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ.. ప్రధానంగా వాటిపైనే చర్చ..!

ఇక, గతంలో కేసీఆర్, అఖిలేష్ యాదవ్‌‌లు.. 2018లో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఇరువురు నేతలు దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేష్‌ను కేసీఆర్ కలవనున్నారని.. సమాజ్ వాదీ పార్టీ ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. 

ఇక, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్‌, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌  ఉన్నారు. తన పర్యటనలో భాగంగా.. ఆర్థిక వేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్.. మే 22న చండీఘర్‌లో పర్యటించనున్నారని.. వివాదస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది. తర్వాతి రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లలో గులాబీ బాస్ పర్యటించనున్నారు. 

ఈ నెల 26న ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారు.  దేశ రాజకీయాలపై దేవేగౌడతో కేసీఆర్ చర్చించనున్నారు. ఈ నెల 27న రాలేగావ్ సిద్ది ప్రాంతానికి కేసీఆర్ వెళ్తారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారావేతో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. అక్కడి నుండి షీర్డీ సాయిబాబా దర్శనం కోసం వెళ్తారు. షీర్డీ నుండి కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు.  ఈ నెల 29 లేదా 30 తేదీల్లో కేసీఆర్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది.  గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించనున్నారు.

click me!