లాక్‌డౌన్ అమలు, కరోనాపై కేసీఆర్ సమీక్ష: అధికారులకు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Apr 10, 2020, 9:46 PM IST
Highlights

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు.

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.

కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Also Read:తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: 487కు చేరిన సంఖ్య, హైదరాబాదులో 200

వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని ఆయన చెప్పారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వారి కుటుంబసభ్యులు, వారు కలిసిన వారిని కూడా గుర్తించి క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువయినప్పటికీ అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: బయటకు వస్తే ఇక తెలంగాణలో మాస్కులు తప్పనిసరి

ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. 

-లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదు. ఈసత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలి. 
-లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలి. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర పోగు కాకుండా దూరం పాటించాలని సూచించారు.
-రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలి.
-ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం రేషన్ కార్డున్న ప్రతీ కుటుంబానికి రూ.1500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయింది. అందరికీ డబ్బులు చేరతాయి.
-గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలి. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకుని పోవాలి. 
-పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలి. 

శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

click me!