
నల్గొండ అభివృద్ధిపై తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) సమీక్ష (review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధికి నిధుల విడుదలలో జాప్యంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ఏ పనులు ఎంత వరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు. 2 వేల మంది కూర్చొనేలా నల్గొండలో కళాభారతి నిర్మిస్తామని సీఎం చెప్పారు.
అంతకుముందు నకిరేకల్ ఎమ్మెల్యే Chirumarthi Lingaya, తండ్రి చిరుమర్తి నర్సింహా సంతాప సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మధ్యాహ్న భోజనం చేశారు. ఇక నిన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
కాగా, నిన్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రం లేని సెస్ లు ఎందుకు పెంచుతుంది.. మేం పెట్రోల్ ధరలు ఎప్పుడు పెంచామని ప్రశ్నించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ లో ఆయన మాట్లాడుతూ కరోనాపై మీటింగ్ పెట్టి.. రాష్ట్రాలు టాక్సీలు తగ్గించాలని మోడీ చెబుతున్నారని.. ఆయన మండిపడ్డారు. ఇదేం పద్దతి? ప్రధాని మాట్లాడే మాటలేనా అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారంటూ దుయ్యబట్టారు. ఏ నోటితో రాష్ట్రాలను తగ్గించాలని అడుగుతారని ఆయన ఫైర్ అయ్యారు.
మీరు ఎందుకు పెట్రోల్, డీజిల్ పై సెస్ పెంచారని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్ డీజిల్ పై టాక్స్ పెంచలేదని సీఎం పేర్కొన్నారు. ఆర్టీసీని అమ్మాలని ప్రధాని మోడీ ఆఫర్ పెట్టారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్రం పెద్దలేనని ఆర్టీసీని అమ్మే రాష్ట్రాలకు వెయ్యికోట్ల ప్రైజ్ మనీ ఇస్తారంట.. అంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. పొద్దున లేస్తే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి మతాన్ని వాడతారా అని సిఎం నిలదీశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని... ఊరేగింపుల్లో కత్తులు, కటార్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నారని సీఎం మండిపడ్డారు.
8 నెలల్లో మోడీ ఏం అభివృద్ధి చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ రంగంలో అభివృద్ధి జరిగిందన్న దానిపై ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. పన్నులు పెంచేది మీరు.. రాష్ట్రాలు తగ్గించాలా? ఇదెక్కడి నీతి అని కెసిఆర్ నిలదీశారు. మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కోకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గారు ఇక మీ ఆటలు సాగవు అని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఇంకా చచ్చిపోలేదని రాష్ట్రం పక్షాన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని సీఎం తెలిపారు.