నా ఫాంహౌస్ లో అడుగుపెడితే ఆరు ముక్కలవుతావు: బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్

By narsimha lode  |  First Published Nov 8, 2021, 4:17 PM IST

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం నాడు ఆయన ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.


హైదరాబాద్:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay వరి ధాన్యం అంశం మినహాయించి అంతా సొల్లు పురాణం  చెప్పాడని తెలంగాణ సీఎం Kcr చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుండి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందో లేదో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన కోరారు. మరోవైపు ఈ విషయమై Bjp నేతలు కూడా తమ వైఖరిని చెప్పాలన్నారు.

సోమవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీకి సమీపంలో ఆందోళన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.  ప్రజల పక్షాన ప్రశ్నిస్తే  బీజేపీ నేతలు దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటూ ప్రచారాన్ని మొదలు పెడుతున్నారన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సైలైట్ గా ముద్ర వేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. గత ఏడేళ్లుగా దేశంలో ఇదే తంతు జరుగుతుందన్నారు.  బీజేపీకి అవసరమైన బిల్లులకు పార్లమెంట్ లో సహాయం కోరిన సమయంలో మాత్రం కేసీఆర్ దేశద్రోహి కాడని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

మేఘాలయGovernor, బీజేపీ ఎంపీ Varun Gandhi లు కూడా  రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీరిద్దరూ కూడా దేశ ద్రోహులేనా అని ఆయన ప్రశ్నించారు. దేశం దురాక్రమణకు చూడకుండా చూడాలని కోరితే  తనను దేశ ద్రోహిగా ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

6 హలికాప్టర్లలో  62 లక్షల ఎకరాల్లో వరి పంట చూపిస్తా

 రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో  paddy పంటను చూపిస్తాననని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఆరు హెలికాప్టర్లను పెట్టి  62 లక్షల ఎకరాల్లో వరి పండించిన విషయాన్ని చూపిస్తానని చెప్పా,రు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేస్తోందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నీ వెంట కేంద్ర మంత్రిని, అధికారులను తెచ్చుకోవాలని సీఎం సలహా ఇచ్చారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పిన బండి సంజయ్ కేంద్రం నుండి ఫోన్ రాగానే మాట మార్చాడన్నారు. బీజేపీ నేతలు, కేంద్రం వైఖరిని ప్రజలకు వివరించేందుకు ప్రతి రోజూ తాను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. 

గొర్రెల పథకానికి కేంద్రం నిధులిస్తుందని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా

రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు పంపిణీ చేస్తున్న గొర్రెల పథకానికి కేంద్రం నుండి నిధులు ఇస్తున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  కేసీఆర్ స్పందించారు.ఈ నిధులను కేంద్రం నిదులు ఇచ్చినట్టుగా రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ పథకానికి ఎస్‌సీడీసీ నుండి తమ ప్రభుత్వం అప్పు తీసుకొందన్నారు. ఈ పథకం  బీజేపీదే అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ లాగా దళితుడిని సీఎం ను చేస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు. దళితుడిని సీఎం చేయకపోవడానికి కొన్ని కారణాలున్నాయన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు. తొలుత 60 సీట్లు వస్తే, రెండోసారి 88 సీట్లను ప్రజలు తమకు కట్టబెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు.

అడుగు పెడితే ఆరు ముక్కలు అవుతావు: కేసీఆర్ వార్నింగ్

నా ఫామ్‌హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలు అవుతావని సీఎం కేసీఆర్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను హెచ్చరించారు. తాను ఫామ్ హౌస్ లో  ఉంటే తప్పేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. తన వ్యవసాయభూమిలో వ్యవసాయం చేసుకోవడం తప్పా అని కేసీఆర్ అడిగారు. తనకు కంపెనీలు లేదు, దొంగ వ్యాపారాలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు.  తాను మందు తాగుతానని తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు ఎప్పుడైనా నాకు మందు కలిపావా అని  సంజయ్ ను అడిగారు. నీ గురువులు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని కేసీఆర్ ప్రశ్నించారు.నా ఫాం హౌస్ ను దున్నడానికి బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా అని కేసీఆర్ సెటైర్లు వేశారు.
ఎన్నో ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధించామన్నారు. మిడ్ మానేరు సహా ఇతర ప్రాజెక్టుల కింద  వారసత్వం కింద తనకు తన అత్తగారికి చెందిన  భూములు కోల్పోయామన్నారు. ఊళ్లకు ఊళ్లే ప్రాజెక్టుల కింద మునిగిపోయాయన్నారు. అక్కడ మునిగిన భూముల స్థానంలో వచ్చిన పరిహారంతో మరో చోట భూములు కొనుగోలు చేశామన్నారు. 

వరి కొనుగోలుకై నవంబర్ 12న ఆందోళనలు


వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళనలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం వైఖరిని ప్రకటించే వరకు  తాము వదిలిపెట్టబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తమ రాష్ట్రంలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. పెట్రోల్, డీజీల్ పై సెస్  తగ్గించేవరకు తమ కేంద్రం వెంటపడుతామన్నారు.సీడ్ కంపెనీతో ఒప్పందం ఉన్న రైతులు ధాన్యం పండించుకోవచ్చన్నారు. మిల్లర్లతో ఒప్పందం ఉన్న రైతులు  వరి ధాన్యం పండించుకోవచ్చన్నారు. గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాం, అపోజిషన్ లో ఉండమంటే అపోజిషన్ లో ఉంటామని కేసీఆర్ చెప్పారు. రాజకీయాల్లో ఎవరికీ అధికారం శాశ్వతంగా ఉండదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అధికారం ఓసారి రావొచ్చు, ఒకసారి పోవచ్చు.. అది ప్రజాస్వామ్యంలో చాలా సాధారణ విషయమన్నారు. తమ పార్టీ అభ్యర్ధులు ఎంత భారీ మెజారిటీతో విజయం సాధించారో తెలుసునన్నారు. .  తాము ప్రజలకు మేలు చేసేందుకు  పనిచేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కేంద్రంతో ఘర్షణ ఎందుకు అని ఇంతకాలం పాటు సర్దుకుపోయామన్నారు. కానీ వరి ధాన్యం, పెట్రోల్, డీజీల్ పై సెస్ తగ్గించాలని  ప్రజలంతా బీజేపీ నేతలను నిలదీయాలని కేసీఆర్ ప్రజలను కోరారు. దళిత బంధు పథకం వంద శాతం అమలు చేస్తామని కేసీఆర్  హామీ ఇచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తామన్నారు. మరో వైపు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో కూడా దళిత బంధును అమలు చేస్తామన్నారు. మిగిలిన అన్ని నియోజకర్గాల్లో 100 కుటుంబాల చొప్పున ఈ ఆర్ధిక సంవత్సరంలో అమలు చేస్తామన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో  20 వేల కోట్లతో 2 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్  హమీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో 60 లేదా 70 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

జగన్ తో  అదే చెప్పా: కేసీఆర్

రాయలసీమ వెనుకబాటుకు గురైంది. రాయలసీమకు నీళ్లివ్వాలని తాను కోరానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ , ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు, మంత్రులు వచ్చిన సమయంలో కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానన్నారు. ఇవాళ కూడా ఈ మాటకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. కృష్ణా నదిలో నీళ్లు లేవు.. గోదావరి నది నీటిని వాడుకొందామని తాను ఏపీ సీఎం  జగన్ కు చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. బేసిన్లు, బేషజాలు లేవని తాను ఈ విషయాన్ని తాను చెప్పానన్నారు. పక్క రాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

లాభదాయక పంటలను వేయండి: కేసీఆర్

నిజాం షుగర్ ఫ్యాక్టరీని రిపేర్ చేసి రైతులకు అప్పగిస్తామని తాను రైతులకు గతంలోనే ప్రతిపాదించినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం యూపీ, మహారాష్ట్రలలో  చెరుకు పండిస్తున్న రైతులకు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అయితే మహారాష్ట్రలో మాదిరిగా సహకర సోసైటీల ద్వారా నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడుపుకోవాలని రైతులను కోరామన్నారు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వమే నడపాలని కోరారన్నారు. అయితే షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం నిర్వహిస్తే గతంలో తరహా సమస్యలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెరకు పంట రైతులకు లాభదాయకం కాదని సీఎం చెప్పారు. లాభాలు వచ్చే పంటలను మాత్రమే వేయాలని రైతులను కేసీఆర్ కోరారు. తెలంగాణలో పత్తి లాభసాటి పంట అని కేసీఆర్ చెప్పారు. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో ఫసల్ భీమాకు దిక్కు లేదన్నారు.


 

click me!