భద్రాచలానికి చేరుకున్న సీఎం కేసీఆర్: గోదావరికి పూజలు

By narsimha lode  |  First Published Jul 17, 2022, 11:28 AM IST

భధ్రాచలం పట్టణంలోని గోదావరి బ్రిడ్జిపై నుండి గోదావరికి తెలంగాణ సీఎం కేసీఆర్ పూజలు చేశారు. ఆదివారం నాడు ఉదయం సీఎం కేసీఆర్ ఏటూరు నాగారం నుండి భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. 
 


భద్రాచలం: తెలంగాణ సీఎం KCR  భద్రాచలం వద్ద గోదావరి నదికి పూజలు చేశారు. ఆదివారం నాడు ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి Bhadrachalamకి ప్రత్యేక బస్సులో సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బూర్గుంపహాడ్ నుండి Godavari నదిపై ఉన్న బ్రిడ్జి పై నుండి సీఎం కేసీఆర్ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు.  భధ్రాచలం  బ్రిడ్జిపై నుండి గోదావరికి పూజలు చేశారు. గోదావరి తల్లి శాంతించాలని కోరారు.

మహారాష్ట్రతో పాటు గోదావరికి ఎగువన కురిసిన వర్షాలతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. గోదావరి నది భద్రాచలం వద్ద 70 అడుగులు దాటిన పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రి నుండి గోదావరి నదికి వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం నాడు భద్రాచలం వద్ద గోదావరి నది 63 అడుగులకు చేరింది. 

Latest Videos

undefined

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం నుండి గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించుకొంటూ రోడ్డు మార్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. భద్రాచలం పట్టణంలోని పునరావాస కేంద్రంలో ముంపు బాధిత ప్రజలతో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.భద్రాచలం పట్టణాన్ని వరద ముంచెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా కరకట్ట రక్షించింది. అయితే  ఈ కరకట్టను మరింత విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాదు కరకట్ట ఎత్తును కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ విషయమై భద్రాచలం పట్టణానికి చెందిన సుభాష్ నగర్ వాసులు శనివారం నాడు ఆందోళన నిర్వహించారు. 

భవిష్యత్తులో గోదావరి నదికి వరద పోటెత్తితే వరద నీరు పట్టణంలోకి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిను పంపించింది. ఈ నివేదికలో కరకట్ట ఎత్తు పెంచడంతో పాటు కరకట్ట నిర్మాణాన్ని విస్తరించాలని ప్రతిపాదిస్తున్నారు.ఈ విషయమై ముంపు బాధిత ప్రజలు సీఎం కేసీఆర్  దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు.

also read:గోదావరికి వరద: ఏటూరునాగారంలో వరద ప్రాంతాల్లో పర్యటించనున్న కేసీఆర్

1986 తర్వాత గోదావరి నదికి వరద పోటెత్తింది. 1986 తర్వాత గోదావరి నది 70 అడుగులు దాటింది. జూలై మాసంలోనే ఇంత భారీ వరద రావడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో వరదలు వస్తే తమ పరిస్థితి ఏమిటనే భయం వారిలో నెలకొంది. వరద ముంపు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని  బాధితులు కోరుతన్నారు.

వాస్తవానికి సీఎం కేసీఆర్ ఏటూరు నాగారంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత భద్రాచలానికి చేరుకోవాలి. కానీ ఏటూరు నాగారంలో వరద ప్రాంతాల్లో పర్యటించకుండానే కేసీఆర్ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. అయితే మార్గమధ్యలోని వరద ప్రభావిత ప్రాంతాలను  బస్సులో చూస్తూ ప్రయాణించారు. భద్రాచలంలో కరకట్టతో  పాటు ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది.  వరద బాధిత ప్రాంతాలకు అందించే సహాయం గురించి కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం లేకపోలేదు. 
 

click me!