ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్... భోజనానికి రావాలంటూ ఆహ్వానం

By Arun Kumar PFirst Published Dec 20, 2020, 9:59 AM IST
Highlights

నూతన వ్యవసాయ పద్దతులను అనుసరించి అత్యధిక దిగుబడిని సాధించిన ఆంధ్రా ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సన్న రకానికి చెందిన వరిని అధికంగా సాగు చేయాలని రైతులకు సూచించిన విషయం తెలిసిందే. అయితే తమ సూచనల ప్రకారం సన్న రకానికి చెందిన వరిని పండించే క్రమంలో రైతులు నష్టాలను చవిచూడకుండా వుండేందుకు సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నూతన పద్దతుల్లో వరిసాగు చేస్తున్న ఓ ఆంధ్రా రైతుకు స్వయంగా ఫోన్ చేశారు సీఎం కేసీఆర్.

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్నాడు. ఇలా అందరు రైతుల్లా కాకుండా నూతన పద్దతిలో సన్న రకానికి చెందిన వరిని సాగు చేస్తూ అధిక దిగుబడిని రాబట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా తానే ప్రసాదరావుకు ఫోన్ చేసి వెద సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. 

35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేసి ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి సాధించానని కేసీఆర్‌కు ప్రసాద్‌రావు తెలియజేశారు. దీంతో ప్రసాదరావును సీఎం అభినందించారు. ఈ సాగుకు సంబంధించిన మెళకువలను అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా త్వరలోనే తన వద్దకు కారు పంపిస్తానని... ఒక పూట ఉండి బోజనం చేసి వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు ప్రసాదరావు తెలిపారు.   తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను ముఖ్యంగా వరి సాగు పద్దతిని పరిశీలించి తగు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరినట్లు ప్రసాదరావు తెలిపారు. 
 

click me!