చివరి నిజాం ముకరం జా భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు

By Siva KodatiFirst Published Jan 17, 2023, 7:10 PM IST
Highlights

హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం ముకరం జా భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మక్కా మసీదులో ముకరం జా అంత్యక్రియలు జరగనున్నాయి. 

హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం ముకరం జా భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించి, రాజ కుటుంబీకులను పరామర్శించారు. అంతకుముందు ముకరం జా భౌతికకాయం టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుంది. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన పార్ధీవదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మక్కా మసీదులో ముకరం జా అంత్యక్రియలు జరగనున్నాయి. 

కాగా.. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముకరం జా ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. 1724లో అధికారంలోకి వచ్చిన నిజాం రాజ వంశంలో ముకరం జా ఎనిమిదో నిజాం. స్వదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. సంప్రదాయబద్ధంగా చేపట్టాల్సిన కర్మలను పూర్తి చేసిన తరువాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ఖననం చేయనున్నారు. 

ALso Read: ఎనిమిదో నిజాం రాజు ముకరం ఝా మృతి: ఈ నెల 17న హైద్రాబాద్‌కు పార్ధీవదేహం

1967 ఏప్రిల్ 6వ తేదీన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ చౌమహల్లా ప్యాలెస్‌లో ముకరం జా ను యువరాజుగా ప్రకటించారు. సొంత కుమారులను వదిలేసి తన మనవడిని 8వ నిజాంగా, తన వారసుడిగా ఎంపిక చేశారు. ఫ్రాన్స్‌లో 1933లో ప్రిన్స్ ఆజం జా, యువరాణి దుర్రుషెహ్వార్‌లకు ముకరం జా జన్మించారు. హైదరాబాద్ సంస్థానం 1949లో భారతదేశంలో విలీనం అయిన తరువాత రాజాభరణాల కింద ఆయనకు పలు సౌకర్యాలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను 8వ నిజాంగా గుర్తించింది. అయితే 1971లో రాజ భరణాలను కేంద్రం రద్దు చేసింది. 1977లో పలు కారణాల వల్ల ఆయన హైదరాబాద్ విడిచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ చాలా సంవత్సరాలు గడిపారు. తరువాత టర్కీకి వెళ్లారు. అయితే ఆయనకు ఇప్పటికీ హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. 
 

click me!