పార్టీ ఎంపీలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సోమవారంనాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఎల్లుండి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలతో కేసీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో నిరసన వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ ఎంపీలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. సమావేశాలు ప్రారంభమైన రోజున కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేసి సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో వైపు సమావేశాలకు హాజరై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుందనే విషయమై ఎండగడితే ఎలా ఉంటుందని వాదించే వారు కూడా లేకపోలేదు. ఈ విషయాలపై చర్చించిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అయితే ఈ కేసులో అరెస్టైన వారికి బీజేపీ నేతలతో లింకులున్నాయని టీఆర్ఎస్ ఆరోపించింది.ఈ విషయమై దేశంలోని అన్ని కోర్టులకు మీడియాకు ఆధారాలను కేసీఆర్ పంపారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేసీఆర్ చెప్పారు.ఈ క్రమంలోనే బీజేపీపై తన విమర్శల దాడిని మరింత తీవ్రం చేశారు కేసీఆర్. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద వివరణ ఇవ్వాలని సీబీఐ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపింది. వచ్చే వారంలో తాను హైద్రాబాద్ లో అందుబాటులో ఉంటానని సీబీఐకి ఇవాళ కవిత లేఖను పంపారు. అంతేకాదు రాష్ట్రంలో మంత్రుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులను కూడా టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే విషయమై టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.