మునుగోడు ఉప ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ నెల 6వ తేదీన మునుగోడులో అనుసరించే వ్యూహంపై పార్టీ నేతలు చర్చించారు.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుండి పార్టీ నేతలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
also read:మునుగోడు బైపోల్ 2022: గాంధీ భవన్ లో నేడు కాంగ్రెస్ కీలక భేటీ, హజరు కానున్న మాణికం ఠాగూర్
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నాడే ఈసీ షెడ్యూల్ ను విడుదలచేసింది.ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రేపు అభ్యర్ధిని ప్రకటించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది.ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడు స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని రేపు కేసీఆర్ ప్రకటించనున్నారు.
మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ కేటాయిస్తే తాము సహకరించబోమని ప్రత్యర్థి వర్గం ప్రకటించింది. ఈ విషయమై టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. అసంతృప్తులను మంత్రి జగదీష్ రెడ్డి గతంలోనే సీఎం కేసీఆర్ వద్దకు తీసుకు వచ్చారు. సీఎం వద్ద సమావేశం ముగిసినతర్వాత టికెట్ ఎవరికి వచ్చినా సహకరిస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ సమావేశం ముగిసిన రెండు రోజుల తర్వాత అసమ్మతి వాదులు సమావేశమయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ఇస్తే సహకరించబోమని ప్రకటించారు. దీంతో అసంతృప్తులతో టీఆర్ఎస్ చర్చలు జరుపుతుంది. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ అగ్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుంది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. ఇప్పటికే నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్ కు ఎమ్మెల్యే, ఎంపీలను ఇంచార్జీలుగా నియమించింది. ఈ నెల 6వ తేదీ నుండి యూనిట్ ఇంచార్జులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.తక్కెళ్లపల్లి రవీందర్ రావును పార్టీ ఇంచార్జీగా నియమించచారు కేసీఆర్. నియోజకవర్గంలోనే మకాం వేసి రవీందర్ రావు పరిస్థితులను చక్కబెడుతున్నారు. మరో వైపు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లు నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం తమకు ఇవ్వడం లేదని బూర నర్సయ్య గౌడ్ గత మాసంలో ప్రకటించారు. తనను అవమానిస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టేనని కూడా ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇస్తామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆచరణలో అది జరగడం లేదని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలను బట్టి తేలింది.