ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు
ఖమ్మం: ఖమ్మం నూతన కలెక్టరేట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలు, జాతీయ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. యాదాద్రి నుండి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో మరో మూడురాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలతో కలిసి సీఎం కేసీఆర్ ఖమ్మంకు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి బస్సులో ఖమ్మం నూతన కలెక్టరేట్ కు కేసీఆర్ సహా సీఎంలు, జాతీయ నేతలు చేరుకున్నారు. ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.
కలెక్టరేట్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 15 కొత్త కలెక్టర్ కార్యాలయాలు ప్రారంభించారు. ఇంకా ఏడు జిల్లాల్లో నూతన కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కార్యాలయాలను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు.
also read:యాదగిరిగుట్టకు చేరుకున్న నలుగురు సీఎంలు: గెస్ట్ హౌస్ కే పరిమితమైన విజయన్, రాజా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం . కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టర్ కార్యాలయాలను నిర్మించింది. ప్రతి కలెక్టర్ కార్యాలయంలో మంత్రులతో పాటు జిల్లా అధికారులతో పాటు ప్రతి శాఖకు చెందిన కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేశారు.మరో వైపు మంత్రులు, అధికారులు, విజిటర్స్ వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఆవరణలోనే జిల్లా అధికారుల నివాస సముదాయాలను కూడా ఏర్పాటు చేశారు.