ఫడ్నవీస్, జగన్‌ల సమక్షంలో.. కాళేశ్వరంను జాతికి అంకితం చేసిన కేసీఆర్

By Siva KodatiFirst Published Jun 21, 2019, 11:28 AM IST
Highlights

తెలంగాణ ప్రజల జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గురువారం జాతికి అంకితం చేశారు

తెలంగాణ ప్రజల జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గురువారం జాతికి అంకితం చేశారు. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీ ని ప్రారంభించారు కేసీఆర్.. 

మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నెంబర్ మోటార్‌ను ఆన్ చేయడం ద్వారా కేసీఆర్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మేడిగడ్డ వద్ద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ‌హాజరయ్యారు. అనంతరం అతిథులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీకి అనుబంధంగా నిర్మించిన బ్రిడ్జి గుండా కేసీఆర్ మహారాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లారు.

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెంటరీని గవర్నర్, కేసీఆర్, జగన్, ఫడ్నవీస్ వీక్షించారు. మేడిగడ్డ నుంచి హెలికాఫ్టర్‌లో కన్నేపల్లి వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్, కేసీఆర్, జగన్‌ పూర్ణాహుతి అనంతరం పంపుహౌస్‌ను ప్రారంభించారు. మిగిలిన పంపుహౌస్‌లను తెలంగాణ మంత్రులు ప్రారంభించారు. 

అంతకు ముందు మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠానికి చెందిన అర్చకులు ఏర్పాటు చేసిన జలసంకల్ప యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.

click me!