న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభాన్ని పురస్కరించుకొని పార్టీ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారంనాడు ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని తన చాంబర్ లో కేసీఆర్ ఆసీనులయ్యారు.ఇవాళ మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన చాంబర్ లో పార్టీ నియామాకాలపై కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం ఈ నియామాకాలకు సంబంధించిన పత్రాలను కేసీఆర్ ఆయా రాష్ట్రాల నేతలకు అందించారు.
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామితో పాటు రైతు సంఘాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యాలయంలో రాజ శ్యామల యాగాన్ని నిన్నటి నుండి నిర్వహిస్తున్నారు. రాజశ్యామల యాగం పూర్తైన తర్వాత వేద పండితుల ఆశీర్వాదాలను కేసీఆర్ సహా అఖిలేష్ యాదవ్, కుమారస్వామి తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారంగా మధ్యాహ్నం 12:37 గంటలకు కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
also read:అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలతో కేసీఆర్ భేటీ: దేశ రాజకీయాలపై చర్చ
ఇవాళ మంచి ముహుర్తం ఉన్నందున బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్ మాసంలో సర్దార్ పటేల్ రోడ్డులో ఓ భవనాన్ని పార్టీ కార్యాలయం కోసం అద్దెకు తీసుకున్నారు. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ స్వంత భవనం పూర్తయ్యాక అక్కడి నుండే కార్యకలాపాలను ప్రారంభించనున్నారు కేసీఆర్. స్వంత భవనం పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ విధానాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏ రకమైన పాత్రను పోషించనుందనే విషయాలను కేసీఆర్ వివరించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకొంటామని కేసీఆర్ ప్రకటించారు.ఈ దిశగా కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నారు. గతంలోనే బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన సీఎంలు, నేతలను కేసీఆర్ కలిశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరును మార్చారు.పార్టీని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు.