
కొందరు వచ్చి అడ్డం, పొడుగు మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరుకు 5 మెడికల్ కాలేజీలు వస్తాయని ఎవరైనా కలలు కన్నారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ఆలోచించాలని కేసీఆర్ నిలదీశారు. గతంలో వున్న పాలకులు కనీసం మంచి నీళ్లయినా ఇచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
గతంలో తనకంటే దొడ్దుగా, ఎత్తుగా వున్న సీఎంలు, మంత్రులు జిల్లాకు ఏం చేశారని ఆయన నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం తెచ్చామన్నారు. తెలంగాణ రాకముందు ఒక్క మెడికల్ కాలేజైనా ఎందుకు తేలేకపోయారని కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో వలస పోయినవాళ్లంతా వాపస్ వచ్చారని ఆయన పేర్కొన్నారు. పాలమూరులో భూముల ధరలు భారీగా పెరిగాయని.. ఇలాంటి పాలమూరే మనం కోరుకున్నదేనని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.
ఇది వరకు తెలంగాణను ఆగం చేసినోళ్లే మళ్లీ బయలుదేరారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రబుద్ధుడు ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నాడని, కొత్త ముసుగు వేసుకుని కొందరు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు వుండేవన్నారు. ఇవాళ థరణిలో ఏమైనా మార్చాలంటే హక్కుదారుకే సాధ్యమన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపిస్తే లబ్ధిదారులకు న్యాయం జరగదని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణిని కాదు.. దాన్ని వ్యతిరేకించే వాళ్లను బంగాళాఖాతంలో కలిపేయాలని సీఎం వ్యాఖ్యానించారు. ధరణి లేకపోతే రైతుల ఖాతాల్లో డబ్బులు పడవని ఆయన పేర్కొన్నారు.
ధరణిని ఆగం చేసుకుంటే ఇవన్నీ వస్తాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని వుంచాలా ..? తీసేయాలా ..? మీరే చెప్పాలన్నారు. ధరణితో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం పేర్కొన్నారు. ధరణితో రైతులకే అధికారం ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని సీఎం అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే రాజ్యం, పైరవీకారులదే భోజ్యమన్నారు. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, ఎన్ని పోలీస్ కేసులు, ఎన్ని హత్యలు జరిగేవని ఆయన ప్రశ్నించారు. రైతులను మళ్లీ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పే కుట్ర జరుగుతుందని కేసీఆర్ ఆరోపించారు. ధరణి గురించి కాంగ్రెస్, టీడీపీలకి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు , అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు.
పాలమూరు ఎంపీగా పోటీ చేసే విషయంలో ప్రొఫెసర్ జయశంకర్ సలహా తీసుకున్నానని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ నిల్చొన్నా తనను ప్రజలు గెలిపిస్తారని జయశంకర్ అన్నారని సీఎం గుర్తుచేశారు. పాలమూరు ఎంపీగా వుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని కేసీఆర్ వెల్లడించారు. కరోనా, నోట్ల రద్దు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ఉన్న కాస్త సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో, విద్యుచ్ఛక్తి వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు సీఎం. సమైక్య రాష్ట్రంలో చెరువులను నాశనం చేశారని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు రైతులు సాగునీరు, తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.