కాంగ్రెస్‌ హయాంలో హోంమంత్రికి మామూళ్లు ఇవ్వాలి: కేసీఆర్

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 2:31 PM IST
Highlights

కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర హోంమంత్రికి సైతం మామూళ్లు ఇవ్వాల్సి వచ్చేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 

కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర హోంమంత్రికి సైతం మామూళ్లు ఇవ్వాల్సి వచ్చేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్ధాలు చెప్పారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని పదవిలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా, రాహుల్‌కు ఏం తెలియదని ఏం మాట్లాడతారో ఆయనకే అర్ధం కాదని ఎద్దేవా చేశారు. పోలీసులను, జైళ్లు ఎదుర్కొంటూ తెలంగాణను సాధించామని కేసీఆర్ గుర్తుచేశారు.

ఖమ్మం జిల్లాలో సమర్థులైన నాయకులున్నారని సీఎం కొనియాడారు. 3500 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్‌ది అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం తన కల అని కేసీఆర్ తెలిపారు.

చిన్న, సన్నకారు రైతులు రోడ్డున పడకుండా రైతుబంధు పథకం ఆసరాగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. సమైక్య పాలనలో తెలంగాణ చితికిపోయిందని..కుల వృత్తులు ధ్వంసమయ్యాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గొర్రెలు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడం కాదు.. మన బిడ్డలు దుబాయ్‌కి మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నీళ్లను కాజేయడానికి, పోలవరం ప్రాజెక్ట్‌ను కట్టుకోవడానికి రాజీవ్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను డిజైన్ చేశారని కేసీఆర్ వివరించారు.

సీతారామ ప్రాజెక్ట్ అన్న పేరు పెడితే కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారన్నారు. ప్రగతి, సంక్షేమం ఆగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లానని సీఎం స్పష్టం చేశారు.

నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని నిర్లక్ష్యం చేయలేదని టీఆర్ఎస్ అధినేత గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సింగరేణి కాలరీస్‌కే స్వాధీనం చేస్తామని, కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం, విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

click me!