ఢిల్లీలో కేసీఆర్ మకాం.. యూపీ ఎన్నికల సరళిపై ఆరా, ప్రచారానికి వెళ్తారా..?

Siva Kodati |  
Published : Mar 02, 2022, 04:00 PM IST
ఢిల్లీలో కేసీఆర్ మకాం.. యూపీ ఎన్నికల సరళిపై ఆరా, ప్రచారానికి వెళ్తారా..?

సారాంశం

బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా పావులు కదుపుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన టూర్‌పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సరళిపై కేసీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. 

జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ (trs) అధినేత కేసీఆర్ (kcr) అందుకు తగ్గట్టుగానే తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తీరుతెన్నులపై వివిధ వర్గాలతో ఆయన సమీక్షించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఈ ప్రయాణ సమయంలోనే ఆయన.. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో (prashant kishor) సుదీర్ఘంగా మంతనాలు జరిపారని.. దేశ రాజధానికి రాగానే పలు ఉత్తరాది నేతలు, సీనియర్ జర్నలిస్టులతో చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. 

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను (arvind kejriwal) కలుసుకునేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వచ్చిన మాటలో నిజం లేదని.. తనతో పాటు సతీమణి వైద్య చికిత్సల కోసమే వచ్చారని టీఆర్‌ఎస్‌ నేత ఒకరు వెల్లడించారు. కేజ్రీవాల్‌ బెంగళూరులోని జిందాల్‌ ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స తీసుకుని మరో వారం తర్వాత తిరిగి వస్తారన్న తమకు సమాచారం వుందని ఆయన చెప్పారు. కేసీఆర్‌ మంగళవారం నిజాముద్దీన్‌ సమీపంలో ఉన్న దంత వైద్యుడి వద్దకు వెళ్లారని, ఆయన సతీమణి బుధవారం ఎయిమ్స్‌లో పరీక్షలకు వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు (mk stalin) సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ మంగళవారం ఆయనకు ఫోన్‌ చేశారు. 

బీజేపీకి వ్యతిరేకంగా మరికొందరు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే వారి అపాయింట్‌మెంట్స్ కొన్ని ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ఇక, ఢిల్లీలో కొంతమది రిటైర్డ్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. వారిని హైదరాబాద్ జరపాలని చూస్తున్న సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు.

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాట్లో భాగంగా గత వారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే (uddhav thackeray0 , ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో (sharad pawar) కేసీఆర్ ముంబై వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్వరలోనే హైదరాబాద్‌ లేదా మరోచోట బీజేపీయేతర సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. 

ఇక, యూపీలో తుది విడుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) తరఫున కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 3వ తేదీన వారణాసిలో(ప్రధాని మోదీ ఇక్కడి నుంచే లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు) సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. ఇందులో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాట్లలో ఉన్న మమతా బెనర్జీ కూడా పాల్గొననున్నారు. 

అయితే ఈ ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్, మమతా బెనర్జీతో (mamata banerjee) పాటు కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కొంతకాలంగా కేసీఆర్ యూపీ ఎన్నికల ప్రచారంలో ఎస్పీ తరఫున ప్రచారం చేయనున్నారని టీఆర్‌ఎస్ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.