ఒక్క మాటతో 55 వేలమంది ఉద్యోగాలు తీసేయగలరా..: కేసీఆర్‌పై భట్టీ ఫైర్

By Siva KodatiFirst Published Oct 6, 2019, 1:40 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చల ద్వారా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించివుంటే సమ్మె జరిగేది కాదని మల్లు తెలిపారు.

ప్రజల అవసరాలు, పాలనను పట్టించుకోని ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. చర్చలు జరపాల్సంది సంబంధిత మంత్రులు మాత్రమేనని అంతేకాని ఐఏఎస్ కమిటీ కాదని విక్రమార్క ఎద్దేవా చేశారు.

తన కేబినెట్‌లో ఉన్న మంత్రులపై కేసీఆర్‌కి విశ్వాసం లేదని.. కేవలం తన చుట్టూ మాత్రమే పరిపాలన జరగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని మల్లు ఆరోపించారు. ఐఏఎస్ కమిటీ ద్వారా కార్మికులతో చంద్రశేఖర్ రావు నామమాత్రపు చర్చలు జరిపించారని ఆయన  మండిపడ్డారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యం కేసీఆర్‌కి లేదని.. అంతేకాకుండా శనివారం  సాయంత్రం ఆరు గంటల కల్లా విధులకు హాజరుకాకపోతే డిస్మిస్ చేస్తామని సీఎం హుకుం జారీచేయడం దారుణమన్నారు.

సమస్యలు ఎప్పుడైనా సరే చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారమవుతాయి గానీ భయపెడితే సాధ్యంకాదని విక్రమార్క  తెలిపారు. సమ్మెలో ఉన్న కార్మికుల ఉద్యోగాలు ఉన్నట్లా..పోయినట్లా అని ఆయన ప్రశ్నించారు. అధికారం కేసీఆర్ తలకెక్కిందని.. ప్రజాస్వామ్యంలో సమ్మెకు వెళ్లడం కార్మికుల హక్కని భట్టి స్పష్టం చేశారు. 

click me!