
టీకాంగ్రెస్ లో జగ్గారెడ్డి (jagga reddy) వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్లు తెలిపారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందని.. ఇప్పుడు అంతా సర్దుకుందని ఆయన వెల్లడించారు. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీల మధ్య వున్న దోస్తీ మోడీ పర్యటన ద్వారా బయటపడిందని భట్టి ఆరోపించారు. బీజేపీ- టీఆర్ఎస్ లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు.
కాగా.. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా (yashwant sinha) హైద్రాబాద్ కు ఈ నెల 2న వచ్చారు. యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో టీఆర్ఎస్ ఘనంగా స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు పాల్గొన్నారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికే కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా కూడా బండకేసి కొట్టాల్సిందేనని రేవంత్ రెడ్డి మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. ఆయన వ్యాఖ్యలను జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Also REad:ఇంకా టైముంది: సంచలన ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
తాము రేవంత్ రెడ్డి పాలేర్లమా అని వ్యాఖ్యానించారు. టీపీసీసీ చీఫ్ పదవి నుండి రేవంత్ రెడ్డిని తొలగించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి లేకపోయినా కూడా పార్టీని నడుపుతామని కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగానే ఈ నెల 3న 24 గంటల్లో సంచలన ప్రకటన చేస్తానని కూడా జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే సోమవారం మాత్రం వ్యూహాంలో భాగంగానే రేవంత్ రెడ్డితో తన గొడవ అని అనుకోండని జగ్గారెడ్డి చెప్పడం చర్చకు దారి తీసింది.