వీధి కుక్కల స్వైర విహారం.. హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్రమంతా ఇదే సమస్య: బాలల హక్కుల సంఘం

Siva Kodati |  
Published : Feb 24, 2023, 03:01 PM IST
వీధి కుక్కల స్వైర విహారం.. హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్రమంతా ఇదే సమస్య: బాలల హక్కుల సంఘం

సారాంశం

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఐదేళ్ల బాలుడిని వీధి కుక్కలు బలి తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల సంఘం స్పందించింది. నగర వీధుల గుండా ఒంటరిగా నడచి వెళ్లాలంటే చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయని సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో వీధికుక్కల నుంచి ప్రజలను, చిన్నారులను కాపాడాలని, వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా జి. కిష్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ. రఘునందన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీధి కుక్కలను నియంత్రించుటకు వాటికి  ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని వాటర్ పాయింట్స్ (నీటి నిల్వ సదుపాయం)ను కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు.   

అంబర్‌పేట ఎరుకల బస్తీలో వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు వీధికుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి వదిలేయడం కాకుండా శాశ్వత నివారణ మార్గాలు చేపట్టాలని సూచించారు. నగర వీధుల గుండా ఒంటరిగా నడచి వెళ్లాలంటే చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల ప్రమాదాన్ని గుర్తించి తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని .. వేసవి కాలంలో వీధి కుక్కల వలన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించారు. 

అయితే ఈ వీధిలోని కుక్కలను పట్టుకొని మరొక వీధిలో విడిచి పెట్టడాన్ని తాము కళ్ళారా చూశామని.. అందువల్ల ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ అధికారులను బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరింది. రాష్ట్రంలోని ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో సైతం వీధి కుక్కల నియంత్రణ కోసం తగు చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు కోరారు. 

ALso Read: కుక్కల దాడిలో చిన్నారి బలి.. అంబర్‌పేట్‌లో పోలీసుల విచారణ, కార్ల షోరూమ్ ప్రతినిధులపై కేసు

కాగా.. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి. 

ప్రదీప్ తండ్రి అక్కడికి వచ్చేలోపే చిన్నారిని ఆ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో బాబుని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లాడిపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?