బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై నివేదిక కోరామన్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో దాదాపు రూ.453 కోట్ల సొత్తు సీజ్ చేశామని.. 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వికాస్ రాజ్ చెప్పారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై నివేదిక కోరామన్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు బీఫాం ఇవ్వడంపైనా ఆరా తీస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని.. ఆదివారం మినహా అన్ని రోజుల్లోనూ నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 10 తర్వాత ఓటరు స్లిప్పుల పంపిణీ చేపడతామని వికాస్ రాజ్ వెల్లడించారు. అభ్యర్ధులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని.. ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామని సీఈవో తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో దాదాపు రూ.453 కోట్ల సొత్తు సీజ్ చేశామని.. 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వికాస్ రాజ్ చెప్పారు. సీ విజిల్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు అందాయని.. 137 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు వున్నాయని సీఈవో వెల్లడించారు.
13 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఎస్పీకి సంబంధించిన అనుమానిత కేసులు వున్నాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఎన్నికల సంఘం లక్ష్యమని.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. త్వరలో 375 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
నామినేషన్ సందర్భంగా మూడు వాహనాలకు అనుమతిస్తామని.. అభ్యర్ధితో సహా ఐదుగురికి మాత్రమే ఆర్వో ఆఫీసులోకి ఎంట్రీ వుంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్ధులు కొత్త బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి దానిలో నుంచే ఖర్చు చేయాలని వికాస్ రాజ్ వెల్లడించారు. డిపాజిట్ కోసం చెక్స్ అనుమతించరని.. ఈ నెల 10 తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అభ్యర్ధులు అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలని వికాస్ రాజ్ పేర్కొన్నారు.