కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం

Siva Kodati |  
Published : Mar 06, 2022, 04:40 PM IST
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం

సారాంశం

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు ఇటీవల తన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా మంత్రులతో పంచుకోనున్నారు చంద్రశేఖర్ రావు. 

మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ (telangana cabinet) సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగనుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (telangana assembly budget session) ప్రారంభం అవుతుండటంతో నేడు కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ ఆమోదం కోసమే కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 2022-23 కు సంబంధించి బడ్జెట్ ను ఆమోదం తెలుపనుంది మంత్రిమండలి. రేపు ఉభయ సభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లోని అంశాలను మంత్రులకు వివరించనున్నారు కేసీఆర్ (kcr). ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్‌లోని అంశాలను మంత్రులకు తెలియజేయనున్నారు. దీంతో పాటు విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి.. వారికి ధీటుగా ఎలా బదులివ్వాలనే దానిపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే  ఇటీవల తన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా మంత్రులతో పంచుకోనున్నారు చంద్రశేఖర్ రావు. 

మరోవైపు రేపటి నుంచి  ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (cv anand) తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 1, 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిటీ పోలీస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో జెండర్‌ ఫర్‌ ఈక్వాలిటీ రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టుగా చెప్పారు.  అసెంబ్లీ వద్ద ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. మొత్తం 1200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని... జిల్లాల నుంచి వచ్చిన పోలీసులకు కూడా ఇప్పటికే బ్రీఫింగ్ ఇచ్చామన్నారు. నేడు మరోసారి కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమావేశం అవుతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వాహనాల్లో సాఫీగా అసెంబ్లీకి చేరేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో 80 మంది మహిళా ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8న మొదటి మహిళా లా అండ్‌ ఆర్డర్‌ ఎస్‌హెచ్‌ఓ నియమిస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మహిళ ఎస్‌హెచ్‌ఓలను నియమిస్తామన్నారు. 

ఇక, మార్చి 7వ తేదీ ఉదయం 11.30 గంటలకు  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి హరీష్‌రావు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ఆమోదంపై నేడు (మార్చి 6) సాయంత్రం  ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu