
2022-23 వార్షిక బడ్జెట్‌కు తెలంగాణ మంత్రిమండలి (telangana cabinet) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు (budget) ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అనంతరం మంత్రిమండలి భేటీ ముగిసింది. రేపు మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (cv anand) తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టుగా చెప్పారు. అసెంబ్లీ వద్ద ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. మొత్తం 1200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని... జిల్లాల నుంచి వచ్చిన పోలీసులకు కూడా ఇప్పటికే బ్రీఫింగ్ ఇచ్చామన్నారు. నేడు మరోసారి కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమావేశం అవుతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వాహనాల్లో సాఫీగా అసెంబ్లీకి చేరేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 80 మంది మహిళా ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8న మొదటి మహిళా లా అండ్ ఆర్డర్ ఎస్‌హెచ్‌ఓ నియమిస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మహిళ ఎస్‌హెచ్‌ఓలను నియమిస్తామన్నారు.