నీ మనవడు, నీ కారుడ్రైవర్ కొడుకు ఒకే స్కూల్లో చదువుతారన్నావ్: కేసీఆర్ పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Jul 2, 2019, 3:11 PM IST
Highlights

అందరికి సమాన విద్యఅందిస్తానని కేసీఆర్ మనవడు ఆయన కారు డ్రైవర్ బాలయ్య కొడుకు ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేలా  విద్యా విధానాన్ని అమలులోకి తెస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు కేసీఆర్ మాటలను నమ్మి విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. సామాన్యుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే చాలా భారంగా మారిపోయిందని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు దోపిడీని వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. 

అన్ని రాష్ట్రాల్లో చదువుకుందామని విద్యార్థులు బడికెళ్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చదువుకొందాం అన్న చందంగా విద్య మారిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 

విద్యను వ్యాపారంగా మార్చి విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడం ద్వారానే పేద, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా విస్తరించిపోయాయన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ కళాశాలలకు తావు లేకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తానని కేసీఆర్ చెప్పారని కానీ ఇప్పుడు మాట తప్పారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. 

అందరికి సమాన విద్యఅందిస్తానని కేసీఆర్ మనవడు ఆయన కారు డ్రైవర్ బాలయ్య కొడుకు ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేలా  విద్యా విధానాన్ని అమలులోకి తెస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆనాడు కేసీఆర్ మాటలను నమ్మి విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. కేజీ టు పీజీ ఉచితంగా ఆంగ్ల బాషలో నిర్బంధ విద్య ప్రవేశపెడతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాలను భ్రష్టుపట్టించిన కేసీఆర్ కు భవిష్యత్ లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని లక్ష్మణ్ హెచ్చరించారు. 

click me!