బందిపోటు దొంగల నుంచి ఆర్టీసీ ఆస్తులను కాపాడండి: గవర్నర్ కు తెలంగాణ బీజేపీ నేతల ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Oct 16, 2019, 5:58 PM IST
Highlights

ఆర్టీసీకి సంబంధించిన భూములను అక్రమంగా లీజులకు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఆస్తులను కొందరు బంధిపోటు దొంగలు దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నేతృత్వంలో పలువురు బీజేపీ నేతలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. 

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో 50వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయని లక్ష్మణ్ ఆరోపించారు. దసరాపండుగ నాడు వారంతా ఆందోళనబాట పట్టాల్సి వచ్చిందన్నారు. నేటికి వారికి జీతాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

పండుగ నాడు పస్తులతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు నానా పాట్లు పడుతున్నాయని తెలిపారు. జీతాలు చెల్లించకుండా ఆర్టీసీ కార్మికులపట్ల కక్షసాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  

ఆర్టీసీకి సంబంధించిన భూములను అక్రమంగా లీజులకు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఆస్తులను కొందరు బంధిపోటు దొంగలు దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీకి వేలాది కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని వాటిని పక్కదారిపట్టించేందుకే ప్రభుత్వం ఇలా మెుండితనంగా వెళ్తోందని ఆరోపించారు. 

అప్పనంగా తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడిసాధించుకోలేదన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడి తెలంగాణను సాధించుకున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

తమ ఫిర్యాదుపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారని చెప్పుకొచ్చారు. సమ్మె, హైకోర్టులో జరిగిన వాదనలపై ఆరా తీస్తామన్నారు. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రప్రజలు కష్టాల్లో ఉంటే వారిపక్షాన పోరాడేందుకు తాముసిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు డా.లక్ష్మణ్. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు అన్ని పార్టీలకంటే బీజేపీ అగ్రభాగాన నిలుస్తుందని చెప్పుకొచ్చారు. 

click me!