బండి సంజయ్ పాదయాత్రకు ఆటంకాలు, అరెస్ట్.. గవర్నర్‌ తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు

By Siva KodatiFirst Published Aug 23, 2022, 9:22 PM IST
Highlights

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించేలా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు వినతిపత్రం అందజేశారు రాష్ట్ర బీజేపీ నాయకులు. అలాగే బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులు, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని వారు గవర్నర్‌ను కోరారు. 

రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిశారు బీజేపీ నేతలు. ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, విజయశాంతి, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు గవర్నర్‌ను కలిసిన వారిలో వున్నారు. బండి సంజయ్ యాత్రకు పోలీసుల నోటీసులు, బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌పై నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించాలని వారు గవర్నర్‌ను కోరారు. అలాగే బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులు, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని వారు గవర్నర్‌ను కోరారు. గవర్నర్ తమిళిసైతో భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సంజయ్ పాదయాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎట్టిపరిస్ధితుల్లో కొనసాగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లోకి కవిత ఇంటి ఎదుట నిరసనకు దిగారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేవారు. వారిపై వివిధ సెక్షన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు ఉదయం జనగామ జిల్లా పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు బండి సంజయ్‎ను అరెస్ట్ చేశారు. ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసిన కరీంనగర్‌కు తరలించారు. 

ALso REad:ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసుల నోటీసులు.. హైకోర్టులో బీజేపీ పిటిషన్

మరోవైపు.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ పోలీసులు మంగళవారం నాడు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

అయితే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 
 

click me!