బీజేపీతో కలవండి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ పిలుపు

By Siva KodatiFirst Published Sep 17, 2021, 3:56 PM IST
Highlights

విమోచన దినోత్సవాన్ని నిర్వహించని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ చేపట్టిన ఉద్యమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కర్నాటకలో విమోచన దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహిస్తున్నారని.. రాష్ట్రాన్ని కేసీఆర్ మూడు ముక్కలు చేసి కొడుకు, అల్లుడు, ఓవైసీకి ఇచ్చేశారంటూ ఆయన దుయ్యబట్టారు.

రజాకార్ల వారసులు హింసించిన హిందూ సమాజానికి మనం భరోసా ఇవ్వాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్. నిర్మల్‌లో గురువారం జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించిన ప్రగతి భవన్‌కు మన సౌండ్ వినిపించాలని ఆయన అన్నారు. ఇక్కడ సౌండ్ చేస్తే దారుస్సలాంలో రీసౌండ్ రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

నిర్మల్ గడ్డ మీద వెయ్యి మందిని ఉరి తీశారని.. వాళ్లంతా ఇప్పుడు మనల్ని పైనుంచి చూస్తున్నారని , వాళ్ల కోసం మనమంతా నినదించాలని ఆయన అన్నారు. నిర్మల్‌లో ఉరితీసిన వెయ్యి మంది యోధుల చరిత్రను చెప్పడానికి ఇక్కడ  సభ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. విమోచన దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కనీసం జెండా ఎగురవేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం క్షమాపణ చెప్పకపోతే ప్రజల్ని అవమానించినట్టా ..? కాదా ..? అని బండి సంజయ్ నిలదీశారు. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోందని బండి సంజయ్ తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని కాంగ్రెస్ హయాంలో కేసీఆర్ డిమాండ్ చేశారని బండి గుర్తుచేశారు. విమోచన దినోత్సవాన్ని జరపకపోతే ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారని.. ఇప్పుడు తాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిస్తున్నానన్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ చేపట్టిన ఉద్యమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కర్నాటకలో విమోచన దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహిస్తున్నారని.. రాష్ట్రాన్ని కేసీఆర్ మూడు ముక్కలు చేసి కొడుకు, అల్లుడు, ఓవైసీకి ఇచ్చేశారంటూ ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కేసీఆర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 

click me!