రక్తం మరుగుతోంది.. కేసీఆర్‌ని వదలను, కరీంనగర్, చర్లపల్లి జైళ్లలో రూమ్ రెడీ : బండి సంజయ్

By Siva KodatiFirst Published Aug 27, 2022, 6:45 PM IST
Highlights

వరంగల్‌లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తున్నామని వ్యాఖ్యానించారు. 

ట్రాఫిక్ , నిబంధనలు, అనుమతుల పేరుతో బీజేపీ సభ ఎక్కడ జరిగితే అక్కడ అడ్డుకోవడానికి టీఆర్ఎస్ సర్కార్ రెడీగా వుంటోందని ఆరోపించారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్‌లో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు, నాన్ బెయిలబుల్ కేసులకు, పీడీ యాక్ట్‌లకు ధర్మ రక్షకులు భయపడరని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్, చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు రూమ్ రెడీ చేశామన్నారు. కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కేసులు, అరెస్ట్‌లతో ఇబ్బందులు పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎప్పుడు చస్తామో, ఎన్నాళ్లు బతుకుతామో చెప్పలేని పరిస్దితులు వున్నాయన్నారు. 

కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదని .. రక్తం సలసలా మరుగుతోందని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేనికైనా భరించి కొట్లాడతామని, దేనికైనా తెగించి కొట్లాడతామన్నారు. బీజేపీ ఎప్పుడూ మతతత్వాన్ని రెచ్చగొట్టలేదని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యారని ఆయన గుర్తుచేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు ధర్నాలు చేస్తున్నా వారిని పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఎంతమందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చావు... ఎంతమంది దళిత రైతులకు మూడెకరాలు ఇచ్చావు అని కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. 

ALso REad:ఢిల్లీకి పాకిన కేసీఆర్ అవినీతి.. త్వరలో ఇంటికే : వరంగల్ సభలో జేపీ నడ్డా వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఏ కంపెనీపై ఈడీ అధికారులు దాడులు చేసినా సీఎం కుటుంబ సభ్యుల పేర్లు బయటకొస్తున్నాయని ఆయన ఆరోపించారు. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికే తనను అరెస్ట్ చేయించారని బండి సంజయ్ అన్నారు. 21 రోజులు తాను పాదయాత్ర చేస్తే.. ముఖ్యమంత్రికి శాంతిభద్రతలు గుర్తుకురాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఢల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఇక్కడ చర్చ జరగకూడదని .. మునావర్ ఫారుఖీతో ప్రోగ్రామ్ పెట్టించారని బండి సంజయ్ మండిపడ్డారు. మునావర్ ఫారుఖీకి 2000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తావ్.. పేదల కష్టాలు తెలుసుకునేందుకు చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్రకు మాత్రం అనుమతివ్వరా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని బూచిగా చూపించి హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించే ఏర్పాట్లు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చెబితే గొడవలు జరుగుతాయని.. ఆయన ఆపమంటే ఆగుతాయని సంజయ్ చురకలు వేశారు. 

click me!