బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడే ఛాన్స్.. కారణమిదే..?

By Siva KodatiFirst Published Aug 22, 2021, 2:27 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు మరోసారి అవాంతరం ఎదురైంది. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతితో ఈ నెల 24 వరకు సంతాపదినాలు ప్రకటించారు. కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తెలంగాణ బీజేపీ శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతితో ఈ నెల 24 వరకు సంతాపదినాలు ప్రకటించారు. కళ్యాణ్ మరణంతో ఆరు రోజులు సంతాపదినాలుగా బీజేపీ ప్రకటించింది. కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తెలంగాణ బీజేపీ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేల మందితో పాదయాత్ర ప్రారంభానికి కాషాయపార్టీ  ఏర్పాట్లు  చేస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ పాదయాత్ర ఆగస్ట్ 9న ప్రారంభం కావాల్సి ఉండగా రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. 

కాగా, ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు భారీగా కదలి రావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా బీజేపీతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో అవినీతి, కుటుంబపాలనను అంతమొందిద్దామని.. ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని బండి సంజయ్ చెప్పారు. సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

ఈ నెల 24వ తేదీన ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభిస్తారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాత్రను కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  పాదయాత్ర చేయాలని  బీజేపీ చీఫ్ నిర్ణయం తీసుకొన్నాడు.ఈ నెల మొదటి వారంలోనే  పాదయాత్ర చేయాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో  పాదయాత్రను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
 

click me!