గాడితప్పొద్దు, ఫిరాయింపులపై తేడాలుంటే చర్యలు తప్పవు : స్పీకర్ పోచారం

By Nagaraju TFirst Published Jan 20, 2019, 6:06 PM IST
Highlights

అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలందరికి కృతజ్ఞతలు తెలిపారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ కమిటీ హాల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలందరికి కృతజ్ఞతలు తెలిపారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ కమిటీ హాల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత అహంకారం లేదని మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేలా అన్ని రంగాలపై క్లుప్తంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అందుకు అంతా సహకరించాలని కోరారు. సభలో సభ్యులంతా సహకరిస్తారని హుందాగా వ్యవహరిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. 

కేసీఆర్ క్యాబినెట్ లో తాను వ్యవసాయ శాఖమంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. తాను అనుసరించిన విధానాల వల్ల తెలంగాణలోని వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నేడు దేశమంతా  రైతుబంధు, రైతుభీమా, 24గంటల కరెంట్ అమలు చూసి  ఆశ్చర్యపోతుందన్నారు. 

అలాగే తెలంగాణ శాసనసభను సైతం దేశానికి ఆదర్శంగా ఉండేలా తాను ప్రణాళికలతో ముందుకు వెళ్తానన్నారు. దేశంలోనే సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అలాగే శాసనసభ వ్యవహారాలలో కూడా మొదటి స్థానంలో ఉండేలా సభ్యులంతా సహకరించాలని కోరారు. 

సభలో అడుగుపెట్టిన నూతన సభ్యులకు సీనియర్లు సహకరించాలని వారు ఎలాంటి తప్పులు చెయ్యకుండా సూచించాలని కోరారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ పాలనను దర్పణం పెట్టేలా ఉందన్నారు. గవర్నర్ ప్రసంగం పై సభలో అన్ని పార్టీల నుంచి ఐదుగురు సభ్యుల అనంతరం సీఎం ప్రసంగించారని తెలిపారు. 

ప్రతి ఎమ్మెల్యే సభను వినియోగించుకోవాలని అలాగే నియమ నిబంధనలు పాటించాలని కోరారు. త్వరలో సభ నియమాలు, నిబంధనలపై నూతన సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి శాసనసభ  పనిదినాలు నిర్వహిస్తామన్నారు. 

రాష్ట్ర ప్రయోజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం తప్పకుండా ఉంటుందన్నారు. గాడి తప్పి మాట్లాడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 
ప్రజలు ఎమ్మెల్యేలపై నమ్మకంతో సభకు పంపుతారని అందువల్ల ఖచ్చితంగా అందరికి మాట్లాడే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 

పార్టీ ఫిరాయింపు అంటే ఎమ్మెల్యేలు తమ సొంత ఇష్టంతో పార్టీ మారుతున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీల చేరికలపై తేడాలు ఉంటే చర్యలు తప్పవన్నారు. 

నియమ, నిబంధనలతో పనిచేసే వ్యక్తులకు ఏ పదవి బరువు కాదన్నారు. 

అసెంబ్లీ వ్యవహాల శాఖ వెబ్ సైట్ మరింత ఆధునీకరణ చేయనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 

click me!