హరీష్ రావుపై కూటమి అభ్యర్థి: ఎవరీ భవానీ రెడ్డి?

By pratap reddyFirst Published 17, Nov 2018, 8:38 PM IST
Highlights

భవానీ రెడ్డి సిద్ధిపేట జిల్లాలోని నాగిరెడ్డిపల్లిలో జన్మించారు. హైదరాబాదు, సిద్ధిపేటల్లో విద్యాభ్యాసం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఆమె సిడ్నీలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశి ఇక్కడికి వచ్చారు. 

హైదరాబాద్: సిద్ధిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావును ఎదుర్కునే ప్రజా కూటమి అభ్యర్థిని తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆయన శనివారం ప్రకటించారు. 

హరీష్ రావుపై భవానీ రెడ్డి పోటీ చేయనున్నారు. మరోసారి కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత టీజేఎస్ తొలి జాబితా విడుదల చేసింది. దుబ్బాక నుంచి చిందం రాజ్‌ కుమార్, సిద్దిపేట నుంచి భవాని రెడ్డి, మెదక్‌లో జనార్ధన్ రెడ్డి, మల్కాజిగిరిను కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నారు. త్వరలోనే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్ నేతలు తెలిపారు.

భవానీ రెడ్డి సిద్ధిపేట జిల్లాలోని నాగిరెడ్డిపల్లిలో జన్మించారు. హైదరాబాదు, సిద్ధిపేటల్లో విద్యాభ్యాసం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఆమె సిడ్నీలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశి ఇక్కడికి వచ్చారు. 

అయితే, హరీష్ రావు ఢీకొట్టేందుకు ప్రతి ఒక్కరూ భయపడే వేళ ఆమె ఆ సాహసం చేస్తున్నారు. 1985 నుంచి సిద్ధిపేటలో కేసీఆర్ కుటుంబానికి చెందినవారు తప్ప మరొకరు గెలిచిన దాఖలాలు లేవు. గత 33 ఏళ్లుగా కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 

పదవ తరగతి వరకు సిద్ధిపేటలో చదివిన భవానీ రెడ్డి హైదరాబాదులో ఆటో మొబైల్ విభాగంలో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. తర్వాత ఆమె ఆర్టీసీలో ఉద్యోగం చేశారు. 2000 నుంచి 2004 వరకు సిద్ధిపేట ఆర్టీసి డిపోలో డిప్యూటీ సూపరింటిండెంట్ గా పనిచేశారు. 

ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి సిడ్నీ వెళ్లారు. అక్కడ 11 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. తెలంగాణ జెఎసికి అనుబంధంగా ఆమె సిడ్నీలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత 2015లో స్వదేశానికి తిరిగి వచ్చి, సిద్ధిపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.

Last Updated 17, Nov 2018, 8:38 PM IST