
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (telangana assembly budget session) నేడు రెండో రోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నట్టుగా కేసీఆర్ చెప్పడంతో.. తెలంగాణ నిరుద్యోగుల్లో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు.. ఇతర రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఇక, నిన్న వనపర్తి పర్యటనలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నిరుద్యోగ యువత కోసం బుధవారం అసెంబ్లీలో నేను ప్రకటన చేస్తున్నా. 10 గంటలకు అందరూ టీవీలు చూడండి.. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో, ఏం ప్రకటన చేయబోతున్నానో తెలుసుకోడానికి నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. దీంతో కేసీఆర్ ఏ విధమైన ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నిరుద్యోగుల్లో, ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే కేసీఆర్ ప్రకటనపై విపక్ష నేతలు స్పందించారు. కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీలపై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు 60 వేలకు పైగా ఖాళీలతో కూడిన నివేదిక ప్రభుత్వం వద్దకు చేరింది. పోలీసు, వైద్యారోగ్య, విద్యా శాఖల్లో ఎక్కువ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు సంబంధించే కేసీఆర్ నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ ఎన్ని వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
టీఆర్‌ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం విపరీతంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్దమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇప్పుడు మొదలు పెడితే ఉద్యోగాలు భర్తీ అయ్యే వరకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంటుందని సర్కార్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, నిరుద్యోగ భృతిపై కేసీఆర్ నుంచి ప్రకటన ఉంటుందా..? లేదా..? దానికి మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది.
ఇక, సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం శాసన సభలో ప్రభుత్వం నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దుచేసింది. బడ్జెట్‌పై చర్చకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా కేసీఆర్ ప్రకటన ఉండాలని డిమాండ్ చేశారు.