ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసు: ముగిసిన ఏసీబీ కస్టడీ, ఏమాత్రం సహకరించని నిందితులు

By Siva KodatiFirst Published Aug 27, 2020, 6:52 PM IST
Highlights

కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో నిందితుల ఏసీబీ కస్టడి ముగిసింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ఎదుట హాజరుపరిచారు.

కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో నిందితుల ఏసీబీ కస్టడి ముగిసింది. మూడు రోజుల పాటు నలుగురు నిందితులను అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ఎదుట హాజరుపరిచారు.

ఏసీబీకి చిక్కి రూ.కోటి పది లక్షల సొత్తుపై శ్రీనాథ్, అంజిరెడ్డి వివరణ ఇచ్చారు. తమ రియల్ ఎస్టేట్ సత్య డెవలపర్స్‌ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు శ్రీనాథ్ చెప్పాడు. ఎంత నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చామని ఏసీబీకి తెలిపారు.

రూ.90 లక్షలు వరంగల్‌లోని మిత్రుల వద్ద హ్యాండ్ లోన్ తీసుకున్నామని... మరో రూ.20 లక్షలు హైదరాబాద్‌లోని మరో మిత్రుడి వద్ద తీసుకున్నట్లు శ్రీనాథ్ తెలిపాడు. 

అలాగే శ్రీనాథ్, అంజిరెడ్డిల వద్ద దొరికిన ప్రజా ప్రతినిధుల డాక్యుమెంట్లపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. గుండ్ల పోచంపల్లికి సంబంధించి ఆక్రమణలకు గురైన విలువైన భూముల వివరాలను ఆర్టీఏ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లను ఏసీబీకి తెలిపారు అంజిరెడ్డి.

గుండ్ల పోచంపల్లిలో మాజీ ఎంపీ నిధుల నుంచి జరిగిన పనులపై ఆర్టీఏ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లను చూపించారు. తమ గ్రామానికి చెందిన రూ.54 లక్షల ఎంపీ నిధుల లెటర్ హెడ్‌పై స్పష్టత ఇచ్చారు అంజిరెడ్డి.

అలాగే మరో నాలుగు నియోజకవర్గాల పనుల కోసం నిధుల కేటాయింపు కోసం సిద్ధం చేసిన లెటర్ హెడ్స్‌ అని ఏసీబీకి అంజిరెడ్డి తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఏసీబీ విచారణకు నిందితులు సహకరించలేదన్నారు డీఎస్పీ సూర్యనారాయణ.

మాజీ ఎమ్మార్వో నాగరాజు, ఆయన భార్య కలిసి బ్యాంక్ లాకర్ల వ్యవహారంపై తమను తప్పుదోవ పట్టించారని తెలిపారు. అవసరమైతే నిందితులను మరోసారి విచారిస్తామన్నారు.

బీనామీ ఆస్తులపై తాను చేసిన అక్రమాలపై ఏసీబీకి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని డీఎస్పీ  వెల్లడించారు. ఇదే కేసులో కీసర రెవెన్యూ సిబ్బందిని ఏసీబీ విచారించింది.

 

click me!