హైకోర్టు బెయిల్ మంజూరు: జైలు నుండి విడుదలైన తీన్మార్ మల్లన్న

By narsimha lodeFirst Published Nov 8, 2021, 10:15 PM IST
Highlights

చంచల్ గూడ్ జైలు నుండి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న సోమవారం నాడు విడుదలయ్యారు. ఓ వ్యక్తి ని డబ్బుల కోసం బెదిరించారనే కేసులో మల్లన్న జైలుకు వెళ్లాడు. ఇవాళ బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యాడు

హైదరాబాద్: జర్నలిస్ట్ Teenmar Mallanna అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సోమవారం Telangana High Court బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్‌ మల్లన్న Bail పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. 

also read:Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు

బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు.  తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది.మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. 

తీన్మార్ మల్లన్న ఓ వ్యక్తి నుండి బెదిరించి డబ్బులు తీసుకొన్నాడనే కేసులో ఈ ఏడాది ఆగష్టు 27న అరెస్ట్ చేశారు. మల్లన్నను అరెస్ట్ చేసిన తర్వాత మేడిపల్లిలోని క్యూ న్యూస్ ఆఫీసులో  సీసీఎస్ పోలీసులు మూడు దఫాలు  సోదాలు నిర్వహించారు. అనంతరం 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, పలు ఇతర పత్రాలు, స్వాధీనం చేసుకొన్నారు.

జైలుకు వెళ్లడానికి ముందు  తీన్మార్ మల్లన్న  కరోనా సోకినప్పుడు పీర్జాదిగూడలోనే ప్రజా క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ ఇమ్మాన్యుయేల్‌ వద్ద కరోనావైరస్‌కు చికిత్స తీసుకున్నారు. ఇమ్మానుయేల్ ను కూడా అప్పట్లో పోలీసులు విచారించారు. 

జైలు నుండి విడుదలైన తర్వాత మల్లన్న మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకను  73 రోజులుగా జైలులో కేసీఆర్ సర్కార్ పెట్టిందన్నారు.  తాను ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు. ఇవాళ కూడా తాను జైలు నుండి బయటకు రాకుండా టీఆర్ఎస్ సర్కార్ అడ్డుకొనే ప్రయత్నం చేసిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.  73  రోజులు జైల్లో ఉన్నవాడిని మరో 10 రోజులు ఉంటానన్నారు.

30 కి పైగా కేసులున్న తనపై మరో మూడు కేసులు పెడితే భయపడతానా అని ఆయన అడిగారు. న్యాయస్థానాల ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని మల్లన్న వ్యక్తం చేశారు. అక్రమంగా డబ్బులు వసూలు చేశానని తనపై నమోదైన కేసుపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విచారణకు తాను సహకరిస్తానన్నారు. అక్రమంగా తనపై కేసులు పెట్టినవారిని వదలబోనని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.

తీన్మార్ మల్లన్న  బీజేపీలో చేరుతారని ఆయన భార్య మమత గతంలో ప్రకటించారు.జైలు నుండి విడుదలైన మల్లన్న బీజేపీలో ఎప్పుడు చేరుతారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.   అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌లపై ఆయన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
 


 

click me!