Teenmaar Mallanna: మేడ్చల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మల్లన్న తొలుత భావించారు. అయితే ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. భవిష్యత్తులో మల్లన్నకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Telangana Congress: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇదే క్రమంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ పార్టీలు మారుతున్న నేతలతో పలు నియోజకవర్గాల్లో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదే వరుసలో తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ చింతపండు నవీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన అధికారికంగా పార్టీలోకి ప్రవేశించారు.
ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ ప్రచార కన్వీనర్‌గా నియమిస్తూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవల మల్లన్న కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. గతంలో బీజేపీలో ఉన్న ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. మల్లన్న గతంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు.
మేడ్చల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మల్లన్న తొలుత భావించారు. అయితే ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. భవిష్యత్తులో మల్లన్నకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించే నవీన్ ఇటీవలి వరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యుడిగా ఉన్నారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.