లేకపోతే..: కేసీఆర్ కు టీజీ వెంకటేష్ హెచ్చరిక

First Published Jun 21, 2018, 10:51 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు కలపాలని ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు కలపాలని ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. లేకపోతే కేసీఆర్‌ ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు.  

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని, ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని నిలుపుకోవాలని టీజీ వెంకటేష్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేసీఆర్‌ కలిసి రాకపోతే కర్ణాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందని అన్నారు. 

ఢిల్లీ నీతి ఆయోగ్‌ సమావేశానికి ముందే కేసీఆర్‌ ప్రధాని మోడీని కలవడం, నీతి ఆయోగ్‌ భేటీలో ఏపీ సమస్యలపై కేసీఆర్‌ నోరు మెదపక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరి మద్దతు ఉన్నందువల్లే ప్రధాని మోడీ ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయానికి బలం చేకూరుతోందని అన్నారు. 

రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకే తాటిపై ఉన్నారనే సంకేతం వెళితే తప్ప కేంద్రం నుంచి ఏపీకి న్యాయం జరగదని టీజీ అన్నారు. కేసీఆర్‌ మోడీ వలలో పడకూడదని హితవు చెప్పారు.

click me!