సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే తానియాఖాన్ మృతి...

By Bukka SumabalaFirst Published Aug 2, 2022, 8:12 AM IST
Highlights

శంషాబాద్ లో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా ఖాన్ మృతికి సీటు బెల్టు పెట్టుకోకపోవడమే కారణం అని పోలీసులు తెలిపారు. 

శంషాబాద్ : ప్రయాణాల సమయంలో హెల్మెట్, సీట్ బెల్టుల ప్రాముఖ్యత గురించి ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాలను కోల్సోతున్నారు. తాజాగా..ఇంటికి చేరుకోవాలన్న ఆత్రుతలో సీటు బెల్టు పెట్టుకోకపోవడం ఒక యువతి ప్రాణాలను బలితీసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి మరణించగా,  మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.ఆర్జీఐఎ పోలీసుల కథనం ప్రకారం… మెహదీపట్నం పరిధి ఏసీ గార్డ్స్ లో ఉంటున్న కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ రెండో భార్య కుమార్తె, బ్యూటీషియన్ తానియా ఖాన్ (25). 

ఆమె తన స్నేహితులు దియా, మీర్జా అలీతో కలిసి కారులో ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి భోజనానికి వెళ్లింది. సోమవారం అర్థరాత్రి దాటాక ఇంటికి తిరిగి వస్తుండగా శంషాబాద్, సాతంరాయి బస్స్టాప్ దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు వంద మీటర్ల దూరం దూసుకెళ్లి బోల్తా పడడంతో కారు పై కప్పు ఎగిరిపోయింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న తానియా ఖాన్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఎగిరి రహదారిపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. సీటుబెల్టు పెట్టుకున్న మిర్జా అలీ, దియా  స్వల్పంగా గాయపడ్డారు. 

శంషాబాద్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం, కాంగ్రెస్ నేత కుమార్తె మృతి...

తానియా ఖాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తానియా మృతికి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు సంతాపం ప్రకటించారు. అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫిరోజ్ ఖాన్ ను పరామర్శించారు.

click me!