రిపబ్లిక్ డే వేడుకల విషయంలో కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.ఈ విషయమై కేంద్రానికి నివేదిక పంపినట్టుగా చెప్పారు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక పంపినట్టుగా ఆమె తెలిపారు.గురువారం నాడు ఆమె ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. రిపబ్లిక్ డే విషయంలో తెలంగాణ సర్కార్ కేంద్రం గైడ్ లైన్స్ పాటించలేదన్నారు. హైకోర్టు ఆదేశించినా పరేడ్ కు సమయం సరిపోదని సాకులు చెప్పిందని ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం రాకుండా సీఎస్, డీజపీలను పంపారన్నారు. రెండు రోజుల క్రితమే రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకల నిర్వహణ విషయమై ప్రభుత్వం నుండి సమాచారం అందిందన్నారు. రాష్ట్రంలో్ ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని ఆమె చెప్పారు.
రిపబ్లిక్ డే ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ ను శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైకోర్టు విచారించింది. పరేడ్ తో కూడిన రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కారణంగా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. అయితే లక్షల మందితో నిర్వహించే సభలకు కరోనా నిబంధనలు వర్తించవా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయమై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈ నెల 19న సర్క్యులర్ వచ్చిన విషయాన్ని కూడ పిటిషనర్ గుర్తు చేశారు పరేడ్ తో రిపబ్లిక్ డే నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. సమయం తక్కువ ఉన్న కారణంగా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తామని ప్రభుత్వం నిన్న రాత్రి సమాచారం పంపింది. ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. మంత్రులు ఎవరూడ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.