ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఛాన్స్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published May 7, 2019, 4:22 PM IST
Highlights

ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటేనే పీసీసీలో మార్పు ఉంటుందని అప్పటి వరకు ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి బలమైన నేతలు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్రంలో వచ్చేది యూపీఏ ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు జగ్గారెడ్డి. 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకో అలజడి చెలరేగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటారు. అలాంటి సముద్రంలాంటి కాంగ్రెస్ పార్టీలో నేతలు తలొకదారి అయిపోయారు. 

ఎన్నికల్లో ఓడిపోతే పీసీసీని మార్చాల్సిందేనంటూ కొందరు వాదిస్తుంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఫలితాల ముందే పీసీసీ చీఫ్ పై కన్నెర్రజేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో అప్పుడు కూడా పీసీసీనే టార్గెట్ చేశారు. 

పీసీసీ చీఫ్ ను మారిస్తే తెలంగాణలో 7 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుస్తోందని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు చేపట్టలేదు. పీసీసీ రథసారథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డినే ఉంచింది. 

అంతేకాదు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సైతం దింపింది. అయితే ఎన్నికల ఫలితాలు పీసీసీ చీఫ్ మార్పునకు ఎలాంటి సంబంధం లేదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటేనే పీసీసీలో మార్పు ఉంటుందని అప్పటి వరకు ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి బలమైన నేతలు ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్రంలో వచ్చేది యూపీఏ ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు జగ్గారెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

యూపీఏ కోసం చంద్రబాబు, కేసీఆర్ ఒక్కటయ్యే ఛాన్స్ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

click me!