కేసీఆర్‌తో పాటు జగన్‌ను వదలని రేవంత్: పోరాటానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 3, 2020, 5:12 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ నైజాన్ని క్రమంగా ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు.

ఉద్యమకారులంతా కేసీఆర్ చేతిలో అణిచివేతగా గురయ్యారని.. అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల హక్కులను ధ్వంసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.

తెలంగాణకు శాశ్వత విముక్తి కోసం తుది దశ పోరాటం జరగాలన్న ఆయన... ఏ పదవి లేకపోయినా పోరాటానికి తాను సిద్ధమని ప్రకటించారు. ప్రోఫెసర్ కోదండరామ్‌కు రాజకీయ పార్టీ సరిపోదని.. రాజకీయాలకు అతీతంగా ఓ వేదికను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

మరోవైపు జగన్ పైనా రేవంత్ ఫైరయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఆయనలాగే ఉంటారని చెప్పారు. వైఎస్ పోతిరెడ్డిపాడుకు బొక్క పెడితే జగన్ దానిని మరింత పెద్దగా చేస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు.

కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణ ఎత్తిపోసుకుంటున్నది కేవలం ఒక్క టీఎంసీ మాత్రమేనని.. ఇదే సమయంలో ఏపీ మాత్రం 12 టీఎంసీలు ఎత్తిపోసుకునే పనులు చేస్తోందని ఆయన ఆరోపించారు. పవర్ ప్రాజెక్ట్‌లను సైతం చంపే కుట్ర జరుగుతోందని.. పాత విద్యుత్ ప్రాజెక్ట్‌లను చంపి కొత్తవి కట్టాలని ప్లాన్ చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

కేసీఆర్ ఉద్యమకారులను పక్కనబెట్టి పెట్టుబడిదారులకు టికెట్లు ఇచ్చారని.. ఉద్యమకారులను తరిమికొట్టిన తలసానికి మంత్రి పదవి, కొడుక్కి ఎంపీ టికెట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దించితే తప్ప రాష్ట్రంలో పరిస్థితి మారదని ఆయన హెచ్చరించారు. 

click me!