మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ విజయం.. 1,654 ఎకరాల భూమిపై ప్రభుత్వానిదే హక్కు

Published : Feb 07, 2022, 02:48 PM ISTUpdated : Feb 07, 2022, 03:16 PM IST
మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ విజయం..  1,654 ఎకరాల భూమిపై ప్రభుత్వానిదే హక్కు

సారాంశం

హైటెక్ సిటీ సమీపంలోని మణికొండ జాగీర్ (Manikonda Jagir) భూముల కేసులో తెలంగాణ సర్కార్ విజయం సాధించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో (Supreme Court) తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. 

హైటెక్ సిటీ సమీపంలోని మణికొండ జాగీర్ (Manikonda Jagir) భూముల కేసులో తెలంగాణ సర్కార్ విజయం సాధించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో (Supreme Court) తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. దీంతో వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వ పరం అయ్యాయి. మొత్తం 1654 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి దక్కనున్నాయి. ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు (Waqf board) మధ్య ఎన్నో ఏళ్లుగా భూముల వివాదం కొనసాగుతుంది. ఈ కేసులో తెలంగాణ సర్కార్ ఓడిపోతే వక్ప్ బోర్డుకు రూ. 50 వేల కోట్లు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వచ్చేది. ఎందుకంటే.. న్యాయపోరాటంలో ఓడిపోతే వక్ఫ్ బోర్డుకు పరిహారం చెల్లిస్తామని చెప్పి వ్యాజ్యాన్ని ప్రారంభించింది. 

అయితే తాజాగా ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూములపై తెలంగాణ ప్రభుత్వానిదే హక్కు అని చెప్పింది. 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కకు పెట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన జస్టిస్ హేమంత్ గుప్తా ధర్మాసనం.. 156 పేజీల తీర్పును వెలువరించింది.  

దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు మొత్తం 1,654 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్‌ బోర్డు జారీచేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదంగా మారింది. అయితే అక్కడ కేవలం ఒక ఎకరం మాత్రమే దర్గాకు ఉందని ప్రభుత్వం చెబుతుంది. ఈ భూముల్లో కొంత భాగం అప్పటికే 2001లో ISBకి, 2004 తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్, ఇతరులకు కేటాయించడం జరిగింది. అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కేటాయింపులు చేశాయి. వీటిని దేవాదాయ శాఖ భూములుగా భావించిన ప్రభుత్వం.. ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీల కోసం భూములను విక్రయించడం లేదా కేటాయింపులు జరిగాయి.

అయితే ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఆ భూములు దర్గాకు చెందినవని పేర్కొంది. ఆ భూములు దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీకి దాదాపు 150 సంవత్సరాల క్రితం ప్రసాదించిన ఆస్తిగా తెలిపింది. ఇందుకు వక్ఫ్ బోర్డు ట్రెబ్యూనల్‌ కూడా మద్దతు తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వాదనలు నడిచాయి. అయితే హైకోర్టులో వక్ఫ్‌ బోర్డు‌కు అనుకూలంగా తీర్పు వెలవడింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే చాలా కాలం పాటు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. నేడు ఆ భూములు తెలంగాణకు చెందినవేనని సుప్రీం ధర్మాసం తీర్పు వెలువరించింది. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్