
కరీంనగర్: ఏ కష్టం వచ్చిందో పాపం ఓ కుటుంబం మొత్తం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కరీంనగర్ జిల్లా (karimnagar district)లో చోటుచేసుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసుకుని మరో మార్గంలో ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తలతో పాటు వారి పెళ్లీడు కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే... చొప్పదండి మండలంలోని కట్నాపల్లి గ్రామానికి బైరి శంకరయ్య(54), జమున(50) భార్యాభర్తలు. వీరికి పెళ్లీడుకు వచ్చిన శ్రీధర్(25) కొడుకు. అయితే కారణమేంటో తేలీదుగానీ ఈ ముగ్గురూ తమ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి దూలానికి శంకరయ్య తాడుతో, జమున, శ్రీధర్ చీరలతో ఉరేసుకున్నారు.
ఇంటి ప్రధాన ద్వారానికి తాళంవేసి వుండటంతో చుట్టుపక్కల ఇళ్ళవారికి ఎలాంటి అనుమానం కలగలేదు. అయితే తాజాగా ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన వారు వెనకవైపునుండి వెళ్లిచూడగా ముగ్గురు ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దించారు. అనంతరం అక్కడే పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాదం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. జూరాల కాలువలో నలుగురు దూకగా ఓ యువకుడు ఇది గమనించి ఒకరిని కాపాడాడు. మిగతా ముగ్గురు కాలువలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
పెబ్బేరు పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్యలు పదేళ్ల కిందట ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయసున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో భార్యభర్తలు గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య ముగ్గురు పిల్లలను తీసుకుని రాత్రి ఏడున్నర గంటల సమయంలో పట్టణ సమీపంలోని జూరాల ఎడమ ప్రధాన కాలువలోకి దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో.. అటువైపు వెళుతున్న కుమార్ అనే యువకుడు మూడేళ్ల వరుణ్ ని కాపాడగలిగాడు.
తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలిసిన ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్ పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపి వేయించారు. ఇవాళ ఉదయం నుండి గళ్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.