టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.. చిక్కుల్లో పడినట్టేనా..?

By Sumanth KanukulaFirst Published Sep 28, 2022, 4:29 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీబీ పాటిల్ ఎన్నికను సవాల్ చేస్తూ మదన్ మోహన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై పునఃపరిశీలన జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీబీ పాటిల్ ఎన్నికను సవాల్ చేస్తూ మదన్ మోహన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై పునఃపరిశీలన జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. వివరాలు.. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ ఆ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థి మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల్ని ఎన్నికల అఫిడవిట్‌లో బీబీ పాటిల్ నమోదు చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు.  

మదన్‌మోహన్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మదన్ మోహన్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. మదన్‌మోహన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై పునఃపరిశీలన చేయాలంటూ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.  వాదప్రతివాదులు ఇద్దరూ అక్టోబర్ 10న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట హాజరుకావాలని తీర్పులో ఆదేశించింది. 

అయితే ఈ కేసు మెరిట్ మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో అన్ని అంశాలు ఓపెన్‌గానే ఉంటాయని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పులో  స్పష్టం  చేసింది. అయితే బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ తిరిగి హైకోర్టుకు చేరడంతో ఆయనకు చిక్కులు తప్పేలా  కనిపించడం లేదు.  

ఇక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మదన్ మోహన్ జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికలో బీబీ పాటిల్ చేతిలో మదన్ మోహన్ ఓడిపోయారు. 

click me!