Latest Videos

మాస్టారూ.. మీ వెంటే మేమూ..

By Galam Venkata RaoFirst Published Jul 5, 2024, 2:32 PM IST
Highlights

మంచిర్యాల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తమకిష్టమైన టీచర్‌ బదిలీ కావడంతో విద్యార్థులు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు.

చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పే గురువులంటే విద్యార్థులకు ఎనలేని అభిమానం ఉంటుంది. జీవితంలో ఏ స్థాయికి వెళ్లినా వారిని మర్చిపోరు. ఎంత ఎత్తుకు ఎదిగినా గుర్తుపెట్టుకుంటారు. గురువుల గురించి గర్వంగా చెబుతారు. 

అలాగే, నచ్చిన టీచర్‌ పాఠశాలల నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పిల్లలకే తెలుస్తుంది. ఉద్యోగికి బదిలీ అనేది సాధారణమే అయినప్పటికీ.. అది విద్యార్థులకు ఒక్కోసారి బాధ కలిగిస్తుంది. తమను విడిచి వేరే పాఠశాలలకు వెళ్తున్న టీచర్‌ను చూసి మనసులో బాధపడేవారు కొందరుంటారు. మరికొందరు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తారు. ఇంకొందరైతే ఆ టీచర్‌ను తమ పాఠశాలల నుంచి వెళ్లకుండా అడ్డుకుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇటీవలే తెలంగాణలోని సిద్ధిపేట, జనగామ ప్రాంతాల్లో తమకిష్టమైన టీచర్ల బదిలీని నిరసిస్తూ విద్యార్థులు గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయుడి బదిలీ ఆపాలని వారి తల్లిదండ్రులు కూడా అధికారులను కోరారు. 

ఇంతకు మించిన మరో ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తమకిష్టమైన టీచర్‌ బదిలీ అయిన పాఠశాలకే విద్యార్థులు కూడా వెళ్లి చేరడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లి.. విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల బాటపడుతున్న తరుణంలో ఓ టీచర్‌పై నమ్మకం, అభిమానంతో ఇలా విద్యార్థులందరూ ఆయన వెంటే వెళ్లడం అరుదైన ఘటన అని చెప్పవచ్చు.

స్టోరీ ఇదీ....
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.శ్రీనివాస్‌ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు. దాదాపు 12 సంవత్సరాలపాటు పొనకల్‌ ప్రైమరీ స్కూల్‌లో ఆయన పనిచేశారు. ఈ క్రమంలో పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. పిల్లలకు చక్కగా పాఠాలు చెబుతూ వారి మనసుకు దగ్గరయ్యారు. ఆయన పొనకల్‌ స్కూల్‌కి వచ్చాక విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచారు. అంతకుముందు 32మంది విద్యార్థులుండే పాఠశాలలో ఆయన ప్రేరణతో 250 మంది విద్యార్థులు చేరారు. ఇలా విద్యార్థులతో పాటు గ్రామస్థుల్లోనూ మంచి పేరు సంపాదించారు టీచర్‌ జె.శ్రీనివాస్‌..

అయితే, ఇటీవల ఆయన బదిలీ అయ్యారు. పొనకల్‌ నుంచి మరో మూడు కిలోమీటర్లు దూరంలో ఉండే అక్కపెల్లిగూడకు శ్రీనివాస్ ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ఇది ఆ పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగించింది. ఆయన బదిలీని వారు ఆపలేకపోయినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశారు. పొనకల్‌లో చదువుతున్న 250 మంది విద్యార్థుల్లో 133 మంది విద్యార్థులు శ్రీనివాస్‌ బదిలీ అయిన స్కూల్‌కే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా టీచర్‌ శ్రీనివాస్‌ బదిలీ అయిన రెండు రోజుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 133 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు. ఇది టీచర్‌ శ్రీనివాస్‌ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది. పొనకల్‌ నుంచి అక్కపెల్లిగూడకు మూడు కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ వారు లెక్కచేయడం లేదు. మరో మైలు దూరమైన తమకిష్టమైన టీచర్‌ కోసం వెళ్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. 

ఈ పరిణామంపై స్పందించిన శ్రీనివాస్‌... ‘‘విద్యార్థుల తల్లిదండ్రులకు తనపై చాలా నమ్మకం ఉంది. పిల్లలకు నా సామర్థ్యానికి తగినట్లు బోధించడమే నా కర్తవ్యవం. వారు నా బోధనను ఇష్టపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులను కోరుతున్నా’’ అని తెలిపారు. 

అలాగే, గ్రామస్థులు కూడా 12 సంవత్సరాలుగా టీచర్ శ్రీనివాస్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన కృషి, ప్రేరణ వల్లే పొనకల్‌లోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 32 నుండి 250కి పెరిగిందని తెలిపారు. 

‘‘ఆయన విద్యార్థులపై చాలా ఆసక్తి కనబరిచారు. ఎవరైనా పాఠశాలకు గైర్హాజరైతే ఎందుకు రాలేదో విచారించేవారు. తిరిగి వారిని పాఠశాలకు చేర్చేవారు. వెనుకబడిన విద్యార్థులు, చదువులో ఎక్కువ శ్రద్ధ అవసరమయ్యే విద్యార్థులు కోసం పాఠశాల సమయం తర్వాత ప్రత్యేక తరగతులు తీసుకునేవారు" అని ఓ అధికారి చెప్పారు.

ఇది చాలా అరుదైన విషయమని మంచిర్యాల డీఈవో ఎస్.యాదయ్య తెలిపారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో అనుబంధం కలిగి ఉంటారని... వారు విడిచిపెట్టి వెళ్లేటప్పుడు ఉద్వేగభరితంగా ఉంటారని చెప్పారు. అయితే, ఉపాధ్యాయుడి వెంటే వెళ్లి ఆయన పోస్టింగ్ అయిన పాఠశాలలో చేరడం మాత్రం ఎక్కడా చూడలేదన్నారు. ‘‘పొనకల్‌లో శ్రీనివాస్‌ బదిలీ వార్త విని చాలా మంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఆయన చేసిదేమీ లేదు. ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడిన వ్యక్తిగా, తనకు వేరే అవకాశం లేదు’’ అని డీఈవో స్పష్టం చేశారు.

కాగా, పొనకల్ నుంచి బదిలీ అయిన శ్రీనివాస్ ఇప్పుడు అక్కపెల్లిగూడలో కూడా చర్చనీయాంశమయ్యారు. ఆయన వెంటే వెళ్లిన 133 మందితో కలిపి కొత్త పాఠశాల 154 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. 

click me!